Tiger Wandering: శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో పెద్ద పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ, ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక తీవ్ర భయాందోళనలో ఉంటున్నారు. గత వారం రోజులుగా పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో పులి సంచరిస్తోంది. తాజాగా సోంపేట మండల పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మండలంలో పెద్దపులి సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. 


సోంపేట మండల పరిధిలోని మండపల్లి, చీకటి సోంపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని, రాత్రి పూట పశువులకు నష్టం కలిగించినట్లు గుర్తించినట్లు తెలిపారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం ఐదు తరువాత ఉదయం 6 లోపు ఎవ్వరూ ఒంటరిగా తిరొగొద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని, అప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


రాత్రి సమయంలో పశువులను నివాస ప్రాంతాలకు దూరంగా విడిచిపెట్టొద్దని పోలీసులు సూచించారు. పెద్దపులిని పట్టుకోవడానికి అటవీ శాఖా, పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అప్పటి వరకు సోంపేట మండల ప్రజలు జాగ్రత్తగగా ఉండాలని సూచించారు. పెద్దపులి సంచారం గురించి తెలిస్తే కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 94924 19724,  85010 08880కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు సహకరించాలని కోరారు. 


వణికిపోతున్న పల్లెలు
శ్రీకాకుళం జిల్లాలో గత వారం రోజులుగా పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో పులి సంచరిస్తోంది. మంగళవారం రాత్రి కవిటి, కంచిలి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆవులు, గేదెలపై దాడి చేసింది. కంచిలి మండలం మండపల్లిలో మాదిన హరిబాబుకు చెందిన ఆవుపై దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆవు మృతిచెందింది. ఉదయం తోటకు వెళ్లిన రైతు.. మృతి చెందిన ఆవును గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.


కవిటి మండలంలోని పులి సంచరిస్తోంది. సహలాలపుట్టుగలో ఆవు, కొండిపుట్టుగలో గేదె దూడపై పులి దాడి చేయడంతో అవి మృతిచెందాయి. గుజ్జుపుట్టుగ గ్రామంలో ఆవు దూడకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.  ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ, ఈదుపురం, కొఠారీ, ధర్మపురం, రాజపురం పరిసర ప్రాంతాల్లో సంచరించింది. సోమవారం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎ.మురళీకృష్ణంనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయా గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.  


వారం రోజుల క్రితం కంచిలి మండలం మండపల్లి పంచాయతీ, అమ్మగరిపుట్టుగు, బంజీర్ నారాయణపురం, మండపల్లి గ్రామాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి అడుగు జాడలు (పాద ముద్రలు) గుర్తించిన అనంతరం అటవీశాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. పులి సంచారంపై డీఆర్ఓ నిషాకుమారి స్పందించారు. జిల్లాలోని అమ్మగరిపుట్టుగులోని మండపల్లి పంచాయతీలో టైగర్ పాదముద్రలు గుర్తించామని తెలిపారు. 


గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని వెల్లడించారు. పులి తిరుగున్నట్లు అక్టోబర్ 25న అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటినుంచి పులి జాడ కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. పులి సంచరిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.