ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. నవంబరు నెలాఖరులోగా గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ నవంబరు 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా నోటిషికేషన్ల విడుదలకు సీఎం జగన్ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా గ్రూప్‌ 1, 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ల విడుదలకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 


రాష్ట్రంలో 'గ్రూప్‌-1' విభాగంలో 100 ఉద్యోగాలకు, 'గ్రూప్‌-2' విభాగంలో 900 ఉద్యోగాల భర్తీకి  నవంబరు నెలాఖరులోగా నోటిఫకేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌత‌మ్ స‌వాంగ్ తెలిపారు.  2024 ఫిబ్రవరిలో గ్రూప్‌-1, 2 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  ఈ ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని ఆయన పేర్కొన్నారు. 2022 గ్రూప్-1 ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేసిన విష‌యం తెల్సిందే. ఈ సారి గ్రూప్‌-1, గ్రూప్-2 ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియ‌ను కూడా వేగ‌వంతంగా పూర్తి చేస్తామ‌న్నారు. ఈ సారి గ్రూప్-2 సిలబస్‌లో పలు మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. అభ్యర్థులు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ‌ పరీక్షలకు మరింత కష్టపడి సన్నద్దమవ్వాలని ఆయన కోరారు. ఇందులో 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేశారు. వాస్తవానికి 1:50 నిష్పత్తి ప్రకారం 5,550 మందిని మాత్రమే మెయిన్స్ కు ఎంపిక చేయాల్సి ఉంది. 


గ్రూప్‌-1 ప‌రీక్షా విధానంలో మార్పులు..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షావిధానంలో కొన్ని కీలక‌ మార్పులు చేయనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్ల స్ధానంలో ఈ సారి ఒక పేపర్ మాత్రమే ఉండనుంది. అలాగే గ్రూప్-1 మెయిన్స్‌ అయిదు ప్రధాన పేపర్లకి బదులు నాలుగు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో... రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయి. లాంగ్వేజ్‌లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. అయితే సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని గౌత‌మ్ స‌వాంగ్ తెలిపారు.


యూపీఎస్సీ తరహాలో మార్పులు..
యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల తీరును పరిశీలించిన తర్వాతే గ్రూప్-1‌,2 పరీక్షల విధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. డిసెంబర్ నెలలో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఏపీపీఎస్సీ ఆద్వర్యంలో పరీక్షలు జ‌ర‌నున్నాయి. అలాగే జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామ‌న్నారు. ఏపీపీఎస్సీకి సంబంధం లేని పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినపుడు బడ్జెట్ మాత్రం ఆయా శాఖలు భరిస్తాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీడియాలో తప్పుడు కథ‌నాలు ప్రచారమయ్యాయని వాటిని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. 


ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801  పోస్టులు, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...