దోపిడీకి గురవుతున్న గిరిజనులకు అండగా ఉద్యమం మొదలు పెట్టిన అల్లూరి సీతారామరాజు ఆగస్టు 22 1922న మొదటిసారిగా చింతపల్లి, ఆ తరువాత 23, 24 తారీఖుల్లో కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లపై దాడి చేశారు. రిజిస్టర్‌లో సంతకాలు చేసి మరీ ఆయుధాలు పట్టుకెళ్ళారు. వాటిలో 26 తుపాకులూ, 2500 తూటాలూ ఉన్నాయి. ఇది బ్రిటీష్ ప్రభుత్వం కలలో కూడా ఊహించనిది. బ్రిటీష్ కాలంలో పోలీస్ స్టేషన్లను చూస్తేనే సామాన్య జనం వణికిపోయేవాళ్లు. ఇక గిరిజన ప్రాంతాల్లో ఉండేవారి సంగతి చెప్పనవసరం లేదు. బ్రిటీష్ వాళ్లు అనుసరించే కఠిన పద్ధతులే దానికి కారణం. 


ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లపై దాడి చేసేందుకు ప్రజలను ప్రేరేపించి అల్లూరి సీతారామరాజు చర్యను సహించలేకపోయారు బ్రిటీష్ అధికారులు. ఎలాగైనా అల్లూరి సీతారామరాజుని అణచి వెయ్యాలని అనుకున్నారు. అటవీ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు. అప్పుడే 1922 సెప్టెంబర్ 3న బ్రిటీష్ పోలీసులకి, అల్లూరి దళానికి మధ్య చిన్న యుద్ధం జరిగింది. దానిలో అల్లూరి సీతారామరాజు సైన్యం విజయం సాధించగా ఒక బ్రిటీష్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఇది బ్రిటీష్ వారి ఇగోను మరింత రెచ్చగొట్టింది. బ్రిటిష్‌ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టిన రామరాజు పేరు మన్యం ప్రాతంలో మారుమోగిపోయింది. 


సీతారామరాజు పేరు వింటేనే బ్రిటీష్‌ వాళ్లు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా అల్లూరిని మట్టుబెట్టాలని భావించిన బ్రిటీష్ సైన్యం  షికారీగా పేరున్న క్రిస్టఫర్ విలియం స్కాట్ కోవర్డ్, లియోనెల్ నివెల్లే హైటర్ అనే ఇద్దరు అధికారులను రంగంలోకి దింపింది. ఆపరేషన్ ప్రారంభించింది. 


షికారీ అంటే మృగాల వేటగాడు కాదు.. మనుషుల వేటగాడు :


ఈ ఆపరేషన్‌లో ఉన్న స్కాట్ కోవర్డ్‌ను షికారీగా పిలవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. సాధారణంగా వేటగాళ్లను షికారీలని పిలుస్తారు. కానీ బ్రిటీష్ సైన్యంలో తమ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వేటాడేవాళ్ళను షికారీలని పిలిచేవారు. అల్లూరి ఉద్యమం కంటే ముందే జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిపిన జనరల్ డయ్యర్‌ను కూడా ఆంగ్లేయులు షికారీ అని పిలుచుకున్నారు. స్కాట్ కోవర్డ్ 29 మే 1895లో జన్మించాడు. సైన్యంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు. అందుకే స్కాట్‌ను అల్లూరి సీతారామరాజును చంపడం కోసం అసిస్టెంట్ సూపరెండెంట్ హోదాలో నియమించారు. 1914 నుంచి 1920 వరకూ బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన హైటర్‌ను కూడా అదే హోదాలో ప్రత్యేకంగా పిలిపించారు. ఆయన 11 సెప్టెంబర్ 1896లో జన్మించాడు. వీళ్లిద్దరికీ అప్పజెప్పిన ఒకే లక్ష్యం అల్లూరి సీతా రామరాజును చంపడం. 


అల్లూరి ఆచూకీ కోసం మొదలైన వేట  :


అల్లూరి సీతారామరాజును ఎలాగైనా మట్టుబెట్టాలనే తమ ఆశయం కోసం ఈ ఇద్దరు అధికారులూ స్థానిక గిరిజనులను ప్రశ్నించడం, వేధించడం మొదలుపెట్టారు. అటవీ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టారు. అయినప్పటికీ ఫలితం దక్కకలేదు. దీంతో అల్లూరి ఆచూకీ కోసం స్థానికులపై ఒత్తిడి పెంచుతూ వెళ్లారు. అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటించారు. 


మొదలైన వ్యూహాలు :


ఎలాగైనా సరే అల్లూరి సీతారామరాజుని పట్టుకోవాలన్న ఈ ఇద్దరు అధికారులు రామరాజు ఉద్యమం పట్ల సానుభూతిపరులను స్వాధీనంలోకి తీసుకోసాగారు. వాళ్ళ నుంచి రాబట్టిన సమాచారంతో గూడెం కొండలు అనే ప్రాంతంలో సీతారామరాజు ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే రామరాజును చంపడానికి బయలుదేరి వెళ్లారు. ఆ రోజు 24 సెప్టెంబర్1922. బ్రిటీష్ వాళ్లు యుద్ధానికి వస్తున్నారని తెలుసుకున్న సీతారామరాజు ప్రతివ్యూహం రెడీ చేశారు. మార్గం మధ్యలో దామనపల్లి ఘాట్ వద్దకు బ్రిటీష్ సైన్యం చేరుకోగానే అల్లూరి సీతారామరాజు దళం వారిపై గెరిల్లా దాడి చేసింది. తమ వద్ద పెద్దఎత్తున తుపాకులూ, సైన్యం వెంట ఉన్నా అది ఘాట్ రోడ్డు కావడం బ్రిటీష్ సైన్యం చేతులు ఎత్తేసింది. అల్లూరి సైన్యం ఆ ఘాట్‌ రోడ్డుకి ఇరువైపులా ఎత్తైన ప్రాంతంలో ఉండి కాల్పులు మొదలుపెట్టడంతో స్కాట్, హైటర్ ఏం చేయలేకపోయారు.


దామనపల్లి ఘాట్‌ వద్ద జరిగిన ఆ యుద్ధంలో స్కాట్, హైటర్ ఇద్దరి తలలోకి తూటాలు దూసుకెళ్లాయి. దీంతో వాళ్లు స్పాట్‌లోనే మృతి చెందారు. ఉత్తారాది పర్యటలో తెలుసుకున్న గెరిల్లా పద్దతి దాడిని ఇక్కడ అల్లూరి సీతారామరాజు అనుసరించారు. ఈ దాడిలో పాల్గొన్న భారతీయ సైనికులకు మాత్రం అల్లూరి ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఈ దాడి అనంతరం ఎక్కడి శవాలను అక్కడే వదిలేసి బ్రిటీష్‌ సైనికులంతా ఇంటిదారి పట్టారు . 


జరిమానా కట్టి శవాలను తెచ్చుకున్న బ్రిటీష్ అధికారులు :


స్కాట్, హైటర్ మరణం బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు తెలిసింది. కనీసం శవాలను కూడా వెనక్కు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని బ్రిటీష్ అధికారులు పెద్ద అవమానంగా భావించారు. అయినా చేసేది లేకపోవడంతో తమవద్ద పనిచేసే భారతీయులకు తెల్ల జెండా ఇచ్చి శాంతి మంత్రం పాటిస్తూ శవాలు పడి ఉన్న దామనపల్లి ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న అల్లూరి సీతారామరాజు దళాన్ని తమ అధికారుల శవాలను అప్పజెప్పాలని కోరారు. అక్కడ స్థానిక గిరిజనుల ఉపాధిని  ఆంక్షలతో దెబ్బతీసినందుకు, వారిని బాధించినందుకు 500 రూపాయల జరిమానా విధించారు అల్లూరి సీతారామరాజు. దానితో ఆ జరిమానా కట్టి ఆ స్కాట్, హైటర్ శవాలను వెనక్కు తెచ్చుకున్నారు బ్రిటీష్ వాళ్ళు.


ముళ్లపొదలు-పిచ్చి మొక్కల మధ్య ఆ రెండు సమాధులు 


అల్లూరి సీతారామరాజుకు ఐదు వంద రూపాయల జరిమానా కట్టి తెచ్చుకున్న డెడ్‌బాడీలను నర్సీపట్నంలో సమాధి చేశారు బ్రిటీష్ వాళ్లు. ఆ సమాధులపై వారి వివరాలు చెక్కించి... వాటి రక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆ రెండు సమాధులు ఉన్న ప్రాంతం నాశనం కాకూడదని బ్రిటీష్ వాళ్ళు కొన్ని కండిషన్స్‌ పెట్టారు. తాము నిర్మించిన అనేక కట్టడాల పరిసరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు స్వాతంత్య్రం ఇచ్చే సమయంలోనే ఈ కండిషన్ పెట్టారు. దేశంలో అలాంటి కట్టడాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికి స్కాట్, హైటర్ సమాధులు ఉన్న ప్రాంతం అలానే ఉన్నంది. చుట్టూ రకరకాల దుకాణాలూ వచ్చేశాయి. ఆ సమాధులు ఉన్న ప్రాంతం మాత్రం ఎలాంటి శుభ్రత లేకుండా ముళ్ల పొదలతో నిండి పోయింది. నర్సీపట్నంలోని ప్రజల్లో చాలామందికి ఈ సమాధుల చరిత్ర తెలియదు.


అల్లూరి రగిల్చిన స్ఫూర్తి- నిత్య నూతనం :


అల్లూరిని వేటాడడానికి వెళ్లి తామే బలైన వేటగాళ్ల కథ ఇది. అల్లూరి సీతారామరాజు విప్లవాన్ని కేవలం ఒక పితూరీగా తగ్గించి చూపాలన్న బ్రిటీష్ కథనాలకు.. నిజానికి ఆయన నడిపిన ఉద్యమం ఎంత తీవ్రమైందో తెలిపే సంఘటనకు సాక్ష్యం ఈ సమాధులు. ఆయన ప్రాణాన్ని తీయడానికి ఎందుకు బ్రిటీష్ వాళ్ళు తహతహ లాడిపోయారో ఈ సమాధులను చూస్తే తెలుస్తుంది. అందుకే  నిరాయుధుడిగా ఉన్న అల్లూరిని అంత కిరాతకంగా చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చంపారు ఆంగ్లేయులు. అలా తమ కసినైతే తీర్చుకున్నారేమో గానీ తరతరాలుగా తెలుగువాళ్లలో అల్లూరి సీతారామరాజు రగిలించిన స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేకపోయారు.