విశాఖ స్టీల్ ప్లాంట్ చెల్లింపులు ఆలస్యమైనప్పటికీ స్టీల్ ప్లాంట్‌కు సక్రమంగా దిగుమతులను అందించామని ఆగస్ట్ 5 వ తేదీని పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటన అవాస్తవమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ నరసింగరావు ఆరోపించారు. అదానీ గ్రూప్ యాజమాన్యానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎటువంటి శ్రద్ద లేదని ప్రకటని చేయడం హాస్యస్పాదమని ఆయన అన్నారు. యూనియన్ లపై పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గంగవరం పోర్టులో జులై చివరి వారంలో 3 రోజులు వెయ్యి కోట్ల విలువైన కోకింగ్ కోల్ ను అమెరికా, ఆస్ట్రేలియా నుంచి జులై 12 వ తేదీన వచ్చిన 3 షిప్ లను 24 గంటల్లో బెర్త్ ఇవ్వాల్సి ఉండగా 18 వ తేదీ వరకు గంగవరం పోర్టు బెర్త్ లకు రాకుండా పోర్టులోనే ఆపిన విషయం పై దేశమంతా భగ్గుమందని ఈ సందర్భంగా చైర్మన్ గుర్తు చేశారు. కానీ పోర్టు యాజమాన్యం మాత్రం స్టీల్ ప్లాంట్ దిగుమతులు సక్రమంగా చేసినట్లు నంగనాచి కబుర్లు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారానే గంగపోర్టు అత్యధిక లాభాలతో నడుస్తున్నట్లు వారు తెలిపారు. గంగవరం పోర్టు గోడను దాటగానే స్టీల్ ప్లాంట్ ఉన్నా ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున పెంచుతూ విపరీతమైన ఛార్జీలు స్టీల్ ప్లాంట్ నుంచి వసూళ్లు చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
గంగవరం పోర్టు పాత యాజమాన్యం డీవీఎస్ కస్సోర్సీయంతో చేసిన దిగుమతులు టారిఫ్ ను కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్ పై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా పెంచిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోపిన అదనపు భారాన్ని తగ్గించాలి. పాత టారిఫ్ ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దక్షిణ కొరియా ఫోస్కో కంపెనీ, అదానీ గ్రూప్ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు 2017 నుంచి ప్రారంభించారనడానికి పూర్తి ఆధారాలున్నాయి. 2018 లో అప్పటి స్టీల్ శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను గంగవరం పోర్టు వైపు ఉన్న 2 వేల ఎకరాలను కేటాయించే విషయాన్ని పరిశీలించారని నరసింగ రావు తెలిపారు.
సీఐటీయూ ఈ ఆధారాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని సవాల్ చేసిన తరువాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇప్పటి వరకు నిశ్శబ్దాన్ని నటించారు. కానీ గంగవరం పోర్టును అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న తరువాత తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక వైపున విశాఖ స్టీల్ కార్మికులు, అధికారులకు వేతన ఒప్పందం 1-1-2017 నుంచి అమలు చేయలేదని పేర్కొన్నారు.
ప్రమోషన్‌లు లేవు. కానీ దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు వేతన ఒప్పందం చేసి వారికి బకాయిలు కూడా సంవత్సరం క్రితమే చెల్లించారు. గత 4సంవత్సరాల్లో సుమారు 4వేల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు రిటైర్డ్ అయినప్పటికీ కూడా కొత్తగా ఒక్కరిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. ప్రాణాలు తెగించి పనిచేసే వారిపై కేంద్రప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మరోవైపున రూ. 1800 కోట్లతో రైళ్ళువీల్ ప్లాంట్, ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ కొనుగోలు పేరుతో సుమారు రూ. 1000కోట్లు ఒక్క టన్నుకూడా నేటికి రాకుండా నిధులు కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని నరసింగరావు పేర్కొన్నారు.
గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు లాభాలు వస్తే విశాఖ స్టీల్‌లో 40% ఉత్పత్తి తగ్గించి రూ. 3,900కోట్లు నష్టాలు తెప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేట్ చేయడానికి మోడీ, అదానీ చేస్తున్న కుట్ర ఇది అని వారు విమర్శిచారు. అదానీ గ్రూప్‌కు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆసక్తి లేదని తేలిగ్గా అబద్దాలు ఆడడం సరికాదని పేర్కొన్నారు.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోని గర్భంలో ఉన్న మాంగనీస్ గనులు, సరిపల్లి వద్ద ఉన్న ఇసుక గనులు, అనకాపల్లిలో కింతాడ వద్ద ఉన్న క్వార్ట్జ్ గనుల లీజులు ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా రెన్యువల్ జరగాల్సి ఉన్నప్పటికీ రెన్యూవల్ పొడిగించకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దీని వలన కంపెనీ పై అదనపు భారం పడుతున్నది. తక్షణమే లీజలును రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.