విశాఖ గర్జన ముగించుకొని మంత్రులు, వైసీపీ నేతలు విశాఖ నుంచి తిరుగుపయనమవుతున్న టైంలో ఎయిర్‌పోర్టులో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న జనసైనికులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి కార్లపై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది.. మంత్రిజోగి రమేష్‌, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కారుపైకి రాళ్లు విసిరేందుకు కూడా ట్రై చేశారని సమాచారం.  


విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం విశాఖ గర్జన పేరుతో వైసీపీ చేసిన కార్యక్రమం. సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలు. ఇలా ఒకే రోజు రెండు  వేర్వేరు పార్టీలకు చెందిన ప్రోగ్రామ్స్ ఉండటంతో సాగరతీరంలో టెన్షన్ నెలకొంది. 


విశాక గర్జన పేరుతో వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన కార్యక్రమానికి భారీగా జనం వచ్చారు.- వర్షం పడుతున్నా సరే లెక్కచేయకుండా జనం వచ్చారు. మంత్రులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడా అదేస్థాయిలో వచ్చి కార్యక్రమాన్ని హిట్ చేశారు. వికేంద్రీకరణకు అనుకూలంగా మాట్లాడుతూనే టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్ కల్యాణ్, అమరావతి రైతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లందర్నీ ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనీయొద్దని పిలుపు ఇచ్చారు. 


వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రం ముగిసిన వెంటనే జనసేన హడావుడి మొదలైంది. ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకుంటారని తెలుసుకున్న జనసైనికులు భారీగా చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు మొత్తం జన సైనికులతో నిండిపోయింది. అక్కడి నుంచి ర్యాలీగా జనవాణి చేపట్టే ప్రాంతానికి పవన్‌ను తీసుకెళ్లాలని జనసైనికుల ప్లాన్. అయితే ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా జనసైనికులు మాత్రం వినిపించుకోలేదు. 


ఒక్కొక్కరుగా ఎయిర్‌పోర్టుకు జనసైనికులు చేరుకున్నారు. అదే టైంలో విశాఖ గర్జన ముగించుకొని అమరావతి బయల్దేరిన మంత్రులు అటు చేరుకున్నారు. అటుగా వస్తున్న మంత్రులను చూసిన జన సైనికులు.. పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. జగన్‌కు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 


కొందరు మహిళా కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడి చేసినట్టు తెలుస్తోంది. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారని సమాచారం. భారీగా ముట్టడించిన జనసైనికుల పక్కకు లాగి మంత్రులను, వైసీపీ లీడర్లను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి పోలీసులు చాలా శ్రమపడాల్సి వచ్చింది. 


చాలా సమయం తర్వాత జనసైనికులను పక్కకు తప్పించి మంత్రులను సేఫ్‌గా ఎయిర్‌పోర్టులోకి పంపించారు. ఇంతలో పవన్ బయటకు రావడంతో జనజైనికులు అక్కడి నుంచి వెళ్లడం స్టార్ట్ చేశారు. పవన్ చూసిన జనసైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ జీప్‌లో వారి వెంట కదిలారు పవన్ కల్యాణ్.