వికేంద్రీకరణకు ఉత్తరాంధ్ర జై కొట్టిందని ప్రకటించింది వైఎస్‌ఆర్‌సీపీ. జోరువానలోనూ ఉత్తరాంధ్ర గర్జించిందని అందులో పేర్కొంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతూ.. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఉత్తరాంధ్ర ప్రజలు తమ పోరాట స్ఫూర్తిని ఉవ్వెత్తున చాటారని తెలిపింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన వారితో విశాఖ నగరం జన సంద్రమైందని అభిప్రాయపడింది. ఒకవైపు జోరు వాన.. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల గర్జన తోడై, జై విశాఖ.. జైజై విశాఖ.. అన్న నినాదాలు, విశాఖనగరంలో సింహనాదమై ప్రతిధ్వనించాయని ప్రకటించింది. 


విశాఖలోని ఎల్‌ఐసీ బిల్డింగ్ వద్ద అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు జోరు వర్షంలోనూ రెండున్నర గంటలపాటు భారీ ఎత్తున ర్యాలీ చేశారని తెలిపింది వైఎస్‌ఆర్‌సీపీ. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర ప్రజల గర్జనకు, జన తుపానుకు జోరున వాన శాంతించిందని తెలిపింది. ఉత్తరాంధ్ర జోలికొస్తే.. అమరావతి యాత్రల పేరుతో దండయాత్రలు చేస్తే.. ఉప్పుపాతరేస్తామంటూ ప్రజలు గర్జించారని వెల్లడించింది. దారిపొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం తెలిపారని వివరించింది. 


విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న డిమాండ్‌తో జేఏసీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారని వైసీపీ తెలిపింది.   విశాఖే పరిపాలనా రాజధానిగా చేయాలని నినదించారని ప్రకటనలో వెల్లడించింది. జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రాన్ని విభజించారని.. మళ్ళీ అమరావతే ఏకైక రాజధాని అయితే.. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి పునరావృత్తం అవుతుందని హెచ్చరించారు. 


 మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ.. విశాఖ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఉత్తరాంధ్రపై పాదయాత్రల పేరుతో, దండ యాత్రకు వచ్చినా, మా ప్రాంతానికి నష్టం చేయాలని చూసినా.. ఇక్కడి ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కో అల్లూరి సీతారామరాజై ఉద్యమిస్తారని హెచ్చరించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని తీరుతాం.. దీన్ని ఆపగలిగే మొనగాళ్ళెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డొస్తే.. వారెవరైనా చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.