విశాఖ గర్జన వేదికగా అమరావతి రైతులు, తెలుగు దేశం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు. చంద్రబాబుకు ఆ 29 గ్రామాల అభివృద్ధి మాత్రమే కావాలని... అందుకే అమరావతి అంటూ ఫేక్ యాత్ర చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి ఆయనకు పట్టనే పట్టదని విమర్శించారు.
ప్రజాపోరాటమంటే తమదని... విశాఖ గర్జనతోనే అది స్పష్టమైందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు చేస్తున్నది రియల్ ఎస్టేట్ పోరాటమని... ఫేక్ రైతులను వెంటపెట్టుకొని కొంతమంది చేస్తున్న ఆ పోరాటానికి విలువలేదన్నారు. అభివృద్ధి కావాలనుకున్న వారంతా వికేంద్రీకరణకు జై కొడుతున్నారని... ఒక్క చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా మాత్రమే అమరావతి రాజధానిపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ గర్జన చూసిన తర్వాత టీడీపీ, జనసేన నేతల గుండెళ్లో రైళ్లు పడుగెడుతున్నాయని అభిప్రాయపడ్డారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వేలల్లో జనం వచ్చారంటే వికేంద్రీకరణకు ఎంత మద్దతు ఉందో అర్థమవుతుందన్నారు. విశాఖ గర్జన చూసిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు ఉత్తరాంధ్ర వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆస్తుల సంపాదన కోసం చంద్రబాబు రాజకీయాలు చేస్తే ప్రజలు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి జగన్ రాజకీయాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆ నలుగురు అభివృద్ధి కోసమే చంద్రబాబు ప్రయత్నిస్తుంటారని... వారికి ఆస్తులు సంపాదించి పెట్టడమే ఆయన ఏకైక లక్ష్యం అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకొని అమరావతి పేరుతో ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారని వారితో ఇతర ప్రాంతాల ప్రజల సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
విశాఖను రాజధానిగా ప్రజల పూర్తి అంగీకారం ఉందని.. దీన్ని వదులుకునే పరిస్థితిలో ఉత్తారంధ్ర వాసులు లేరని అభిపప్రాపయపడ్డారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనాన్ని తొలగించేందుకే విశాఖను రాజధానిగా జగన్ ప్రకటించారని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చజరుగుతోందన్నారు. అందుకే విశాఖ గర్జనకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనం తరలి వచ్చారని తెలిపారు.
విశాఖ గర్జన పేరుతో వైసీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి నిర్వహించిన ర్యాలీ జోరు వానలో కొనసాగుతోంది. వర్షం దంచి కొడుతున్నా ర్యాలీకి భారీగా జనం తరలి వచ్చారు. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు, వైసీపీ లీడర్లు భారీగా తరలి వచ్చారు.
వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతులకు వ్యతిరేకంగా విశాఖ గర్జన ర్యాలీతో తీరం పోటెత్తింది. వైఎస్‌ఆర్‌సీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి ఈ ర్యాలీ చేపట్టాయి. అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ... బీచ్‌లోని వైఎస్ విగ్రహం వద్ద ముగుస్తుంది. దీని కోసం విశాఖ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రూట్‌లో ట్రాఫిక్‌ను నిలిపేశారు.