విశాఖ గర్జన పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ర్యాలీ, అక్కడ మంత్రులు, నేతలు చేస్తున్న విమర్శలకు దీటుగా టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. ఫేక్ ఉద్యమానికి విద్యార్థులు తరలించడమే కాకుండా మార్ఫింగ్ ఫొటోలతో జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. 


అమరావతి గురించి సీఎం జగన్ గతంలో చేసిన ప్రకటనలు గూగల్‌లో ఇట్ట కొడితే అట్టా వచ్చేస్తాయంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌. ట్విట్టర్ వేదికగా జగన్, వైసీపీపై సెటైర్లు వేశారు. "జగన్ రెడ్డి చెప్పే మాటలు వేరు. చేసే పనులు వేరు. తాను విశ్వసనీయతకి మారు పేరు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుని నాడు మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్.. నేడు సొంతంగా విషమద్యం అమ్ముతూ జనం ప్రాణాలపై కోట్లు దండుకుంటూ. "విషపు"నీయత కోరలు చాచారు." అంటూ తీవ్ర విమర్శలు చేశారు లోక్షేష్‌ 






తన మేనిఫెస్టో బైబిల్,ఖురాన్,భగవద్గీతతో సమానమని చెప్పిన జగన్‌... అమరావతియే రాజధాని అని ప్రతిపక్షనేతగా హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక మూడుముక్కలాట మొదలెట్టి పవిత్ర మత గ్రంథాలని అవమానించారని విమర్శించారు లోకేష్. తాను ఇచ్చిన మాటలు జగన్ మరిచిపోయినట్టు నటిస్తున్నారని ధ్వజమెత్తారు. 


జగన్ ఎన్ని చేసినా ఆయన గతంలో చేసిన ప్రకటనలను జనం మర్చిపోరకని... గూగుల్ ఇట్టా కొడితే అట్టా కార్తీక దీపం సీరియల్లా వరసగా అమరావతిపై జగన్ రెడ్డి మాట తప్పుడు-మడమ తిప్పుడు బాగోతం వచ్చేస్తుందన్నారు. 


విశాఖ గర్జనకు, వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టు కొన్ని ఫొటోలను, స్టేట్‌మెంట్‌లను వైసీపీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో ఉన్న వాళ్లంతా ఫేక్‌ బ్యాచ్ అంటూ టీడీపీ ఫ్యాక్ట్‌చెక్‌ మొదలు పెట్టింది. ఎవర్రా వీళ్ళంతా ? మీరు ఫేక్ గాళ్ళు అని తెలుసు కానీ, ఏకంగా మనుషులనే ఫేక్ చేసి పడేస్తున్నారుగా.. అంటు వైఎస్‌ఆర్‌సీపీ పెట్టిన ఫొటోలపై పోస్ట్‌మార్టం చేసింది టీడీపీ. 
ఏపిలో రైతు ఫోటో దొరకలేదా ? ఏకంగా ఒడిశా నుంచి ఫోటో లేపుకొచ్చారని సెటైర్లు వేసింది. దానికి సంబంధించిన ఆధారాల లింక్‌ను కూడా ట్విట్టర్‌లో పెట్టిందా పార్టీ. ఒడిశా రైతుకు మూడు రాజధానులతో పనేంటని ప్రశ్నించింది. నెట్‌లో ఫొటోలు తీసుకొచ్చి  ఫేక్ కథలు అల్లుతున్నారని మండిపడింది. 






అంతే కాదు విశాఖ గర్జనకు జనాలు లేకపోయేసరికి కొన్ని కాలేజీల నుంచి విద్యార్థులను తరలించారని చెబుతూ ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం రోజున కాలేజీల్లో ఉండాలసిన విద్యార్థులను రోడ్డున పడేశారని ఎద్దేవా చేసింది తెలుగుదేశం పార్టీ. జగన్ రెడ్డి ఫేక్ గర్జన కోసం కాలేజీ మానిపించి సభకు తరలించారని విమర్శించింది. వైజాగ్‌లో విద్యార్థులు ఎవరినీ బడికి వెళ్ళొద్దని అంతా గర్జనకు రావాలని హుకుం జారీ చేశారట పాపం అంటూ ట్వీట్ చేసిందా పార్టీ.