విశాఖ గర్జన పేరుతో వైసీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి నిర్వహించిన ర్యాలీ జోరు వానలో కొనసాగుతోంది. వర్షం దంచి కొడుతున్నా ర్యాలీకి భారీగా జనం తరలి వచ్చారు. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు, వైసీపీ లీడర్లు భారీగా తరలి వచ్చారు. 


వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతులకు వ్యతిరేకంగా విశాఖ గర్జన ర్యాలీతో తీరం పోటెత్తింది. వైఎస్‌ఆర్‌సీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి ఈ ర్యాలీ చేపట్టాయి. అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ... బీచ్‌లోని వైఎస్‌ విగ్రహం వద్ద ముగుస్తుంది. దీని కోసం విశాఖ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రూట్‌లో ట్రాఫిక్‌ను నిలిపేశారు. 






వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన ఈ ర్యాలీలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, రోజా, అమర్‌నాథ్‌, బొత్స సత్యానారాయమ, కొట్టు సత్యనారాయణ సహా చాలా మంది వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు పాల్గొన్నారు. ముందు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీని వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు ప్రారంభించారు. 


ఈ ర్యాలీ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, అమరావతి రైతులను తీవ్రంగా విమర్శించారు వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు, మంత్రులు. తమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే విశాఖ రాజధాని కావాలంటూ మంత్రులు అభిప్రాయపడ్డారు. కచ్చితంగా వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని... దీని కోసం ఎంతదూరమైనా వెళ్తామన్నారు మంత్రులు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దని టీడీపీ నేతలకు, చంద్రబాబుకు, అమరావతి రైతులకు మంత్రులు, వైసీపీ లీడర్లు విజ్ఞప్తి చేశారు. 


అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు దేవున్ని ఏం కోరుకుంటారని.. ప్రశ్నించారు. సూర్యభగవానుడు ఉన్న ప్రాంతం ఇంకా వెనుకబడిపోవాలని... తాము మాత్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారా అని మంత్రులు ప్రశ్నించారు. అమరావతి రైతులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తమ యాత్ర విరమించి.. వికేంద్రీకరణకు మద్దతు తెలిపాలన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని అవి ఇంకా ఎక్కువ అవుతాయని హెచ్చరించారు. 


అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని... అలాంటి పనే చేసి ఉంటే ఇన్ని రోజులు సజావుగా యాత్ర సాగేది కాదన్నారు మంత్రులు. స్థానిక ప్రజలే వారిని అక్కడక్కడ అడ్డుకుంటున్నారని... ప్రజల మూడ్‌ తెలుసుకొని యాత్రలు చేయాలన్నారు.