గాజువాకలోని గంగవరం పోర్టు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, కార్మికులు, వామపక్షాల నాయకులు పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. దీన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బయటవాళ్లు ఎవరూ లోపలికి రాకుండా ప్రధాన గేటు ముందు పోలీసులు భారీగా మోహరించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు, వారికి మద్దతుగా పోర్టు ప్రభావిత ప్రాంత ప్రజలు, వీళ్లకు మద్దతుగా వామపక్షాలు దూసుకెళ్తున్నాయి. కచ్చితంగా డిమాండ్లు పరిష్కారం కోససం పోర్టును ముట్టడిస్తామని ఆందోళనకారులు చెబుతున్నారు.
ఒకవైపు పోలీసులు, మరోవైపు కార్మికుల దూకుడుతో పోర్టు ఏరియాలో వెదర్ హీటెక్కింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరి నొకరు నెట్టుకొన్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు గాయాలు అయినట్టు సమాచారం. సీఐలకి కూడా గాయాలు అయినట్టు చెబుతున్నారు.
గంగవరం పోర్ట్ గేట్ ముట్టడి కార్మికులు ప్రయత్నించారు. వైస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గట్టిగా ప్రతిఘటించారు. ఎక్కడా కార్మికులు వెనక్కి తగ్గలేదు. ముళ్ల పొదలు, అక్కడ వేసిన కంచెలు దాటుకొని గేట్‌ను ముట్టడించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కార్మికులకు గాయాలు అయినట్టు తెలుస్తోంది.
కనీస వేతనం 36 వేలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోర్టు బంద్‌కు పార్టీలకు అతీతంగా కుటుంబాలతో కలిసి కార్మికులు గంగవరం పోర్టు వద్దకు వచ్చారు. అందుకే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.