Andhra Pradesh Ministers Condemns Jagan Comments On Country: "వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వుయ్ ఆర్ లివింగ్ ఇన్. వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజమ్ ఈజ్ దిస్. వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ వుయ్ ఆర్ లివింగ్ ఇన్. ఇదెక్కడి హిందూత్వం, ఇదెక్కడి హిందూయిజం." అంటూ ప్రెస్ మీట్ లో జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ టీడీపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఇదెక్కడి వితండవాదం అని ట్వీట్ వేశారు. హిందూ మతాన్ని తప్పుబట్టడం అహంకారం అని చెప్పారు. పరమత సహనం, మత సామరస్యం పట్టని జగన్ ది మూర్ఖత్వం అని విమర్శించారు లోకేష్. "దేశాన్ని తక్కువచేసి కించపరచే ఇదెక్కడి ధిక్కారం..?" అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. 






బహిష్కరణ..
జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్. దేశ సంప్రదాయాలు పాటించకపోగా, ఆ సంప్రదాయాలను బహిరంగంగా కించపరుస్తున్న జగన్ ను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలన్నారాయన. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలుంటాయని, వాటిని గౌరవించేవారే మంచి పౌరులు అవుతారన్నారు. మత విశ్వాసాలు, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ, జగన్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం బాధాకరం అని అన్నారు గొట్టిపాటి. ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది, వాటిని అడ్డం పెట్టుకుని దేశ సంపదను జగన్ కొల్లగొట్టారని విమర్శించారు. అదే దేశంలో ఉంటూ.. ఆ దేశ సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారాయన. తిరుమలకు అన్య మతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాలని చెప్పే సరికి.. ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తున్నారని ఇదెక్కడి ఘోరం అని అన్నారు. దేశమన్నా, ఈ దేశ సంప్రదాయాలన్నా జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని.. ఆ విషయాన్ని తనకు తానే బయటపెట్టుకున్నారని చెప్పారు. దేశ సంప్రదాయాలను కించపరిచే జగన్, ఈ దేశంలో మాత్రం ఎందుకుండాలని నిలదీశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. 






ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆఖరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్న జగన్, పోలీసులు నోటీసులిచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అసత్యాలతో ఆయన ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీకి చెందిన ఏఒక్క నాయకుడినైనా పోలీసులు గృహనిర్బంధం చేశారా అని ప్రశ్నించారు. జగన్ ని తిరుమలకు రావద్దని ఎవరూ నోటీసు ఇవ్వలేదని, తిరుమల వెళ్లేందుకు జగన్‌ కే ఇష్టం లేదని అన్నారు. డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేక జగన్ తన పర్యటన ఆపేసుకున్నారని చెప్పారు. తిరుమలలో ప్రసాదం ఇస్తేనే తినకుండా పక్కన పెట్టేవాళ్లు ఆ ప్రసాదం రుచి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు అనిత. లడ్డూ రుచి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని, ఆయన ఏనాడైనా తిరుమల లడ్డూ తిన్నారా అని అడిగారు. డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే, దళితుల అంశాన్ని ముడిపెట్టి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు అనిత. తన మతం మానవత్వం అని జగన్ అంటున్నారని, ఆయన నోటి వెంట వచ్చిన ఆ మాటతో.. ఆ పదమే సిగ్గు పడుతుందని కౌంటర్ ఇచ్చారు.


Also Read: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్