YSRCP Chief Jagan: తిరుమల(Tirumala) పర్యటన రద్దుపై జగన్(Jagan) నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ వీడియోని అందరూ విననాలంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ట్యాగ్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ వేశారు. ఆమధ్య ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి లేఖ రాసి.. ఆ లేఖ ప్రతుల్ని అందరూ చదవాలంటూ ఇతర పార్టీలను, నేషనల్ మీడియాని కూడా జగన్ ట్యాగ్ చేశారు. ఇప్పుడు తన ప్రెస్ మీట్ వినండి అంటూ అన్ని పార్టీలను ఆయన కోరారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు జగన్. అసలు ఆయన ఉద్దేశమేంటి..? లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు తీసుకు రావాలనుకుంటున్నారు. అసలు కేంద్రంలోని బీజేపీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు.
జగన్ ఒక ట్వీట్ తో సరిపెట్టలేదు, తన ప్రెస్ మీట్ ని అప్ లో డ్ చేసి వరుసగా నాలుగు ట్వీట్లు వేశారు. ఒక ట్వీట్ లో జాతీయ పార్టీలను, మరో ట్వీట్ లో నేషనల్ మీడియాని, ఇంకో రెండు ట్వీట్స్ లో కేంద్ర మంత్రులందర్ని ట్యాగ్ చేశారు. మరో ట్వీట్ లో హిందూ ధార్మిక సంస్థలన్నిట్నీ, సీఎంను ట్యాగ్ చేశారు జగన్. అంటే ఆయన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేలా లేరనే విషయం అర్థమవుతోంది. తిరుమల లడ్డూ వ్యవహారంతోపాటు, తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారనే విషయాన్ని దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారాయన. ఏపీలో అధికార మార్పిడి జరిగిన కొత్తల్లో.. ఢిల్లీలో ఓ నిరసన ప్రదర్శన చేపట్టారు జగన్. అప్పుడు కూడా అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించారు. కొందరు వచ్చారు, మరికొందరు తమకు ఆహ్వానం లేదన్నారు. ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో తమకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్.
ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో మాత్రం ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో కలిసేందుకు ఆ పార్టీ మొహమాట పడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతు కోరడానికి వైసీపీ ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో బీజేపీతో ఉన్న సానుకూల ధోరణిని చెడగొట్టుకోవాలని జగన్ అనుకోవట్లేదు. అందుకే చంద్రబాబుపై మోదీకి ఫిర్యాదు చేశారాయన. ఏపీలో జరిగే వ్యవహారాలు ప్రధాని మోదీకి తెలియకుండా జరుగుతాయనుకోలేం. ఆ మాటకొస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి మద్దతు ఉండదని ఆలోచించలేం. అయితే జగన్ మాత్రం చంద్రబాబుపై మోదీ అక్షింతలు వేయాలని, బీజేపీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాలని కోరుకుంటున్నారు. అందుకే కేంద్ర మంత్రులందర్నీ తన ట్వీట్ కి ట్యాగ్ చేశారు.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కూడా తన ట్వీట్ కి ట్యాగ్ చేసిన జగన్.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం పక్కనపెట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ఏపీ వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలనుకోవడం విశేషం.
నో రెస్పాన్స్..
తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే జగన్ ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. వాటిని చదవాలంటూ కేంద్ర మంత్రుల్ని కూడా ట్యాగ్ చేశారు. అయితే వాటిపై ఎలాంటి స్పందన లేదు. తిరుమల వ్యవహారంపై వైసీపీ సీబీఐ విచారణ కోరుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణకు నిర్ణయించింది. ఈరోజు నుంచి తిరుమలలో సిట్ విచారణ మొదలవుతుంది.
Also Read: తిరుపతి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన పాపం పోవాలి- వైసీపీ నేతల ప్రత్యేక పూజలు