Ashok Gajapatiraju On Bhogapuram Airport Land: భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూముల్లో కోత పెట్టడం సరికాదని.. మాజీ కేెంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. అప్పుడు రైతులకు ఎకరాకు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆ భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నందున వైకాపా ప్రభుత్వ పెద్దలు వాటితో వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తోందని అశోక్ గజపతిరాజు సందేహం వ్యక్తం చేశారు. భూములకు అధిక ధర ఉందన్న కారణంగా కోత పెట్టడం సరికాదన్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన 2,700 ఎకరాల భూమిని.. వైకాపా ప్రభుత్వం తగ్గించడాన్ని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. తమ ప్రభుత్వ హయాంలో ఎకరాకు రూ. 17 లక్షల నుంచి రూ. 35 లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నందున వైకాపా ప్రభుత్వ పెద్దలు ఆ భూములతో వ్యాపారం చేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. టీడీపీ హయాంలోనే విమానాశ్రాయ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. అయినా కూడా నిర్మాణ పనులు ఆలస్యం చేసి.. ఇప్పుడు భూమిలో కోత పెట్టడం సరికాదన్నారు.
భోగాపురం విమానాశ్రయంపై ప్రభుత్వ తీరిది
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జీఎంఆర్‌తో ఒప్పందం చేసుకొని ఏడాది పూర్తయిపోయింది. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ఈపాటికే అక్కడ విమానాశ్రయం పనులు సాగుతుండాలి. కానీ, విమానాశ్రయం నిర్మించాలని భావిస్తున్న ప్రాంతానికి జాతీయ రహదారి నుంచి కనీసం అప్రోచ్ రహదారి కూడా నిర్మించలేదు. నిజంగా చెప్పాలంటే విమానాశ్రయం పేరుతో అక్కడ ఏ చిన్న పని కూడా జరగడం లేదు. కానీ ఇటు.. విశాఖపట్నంలో ఆ విమానాశ్రయం పేరిట వందల కోట్ల రూపాయలతో ప్రణాళికల మీద ప్రణాళికలు రూపొందించేస్తున్నారు. ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు.
చిన్న పనీ చేయడం లేదు
విమానాశ్రయం కోసం ప్రభుత్వం ఇక్కడ 2,703 ఎకరాలు సేకరించింది. అందులో 123 ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్నాయి. తమకు సరైన ధర ఇవ్వలేదని కొందరు రైతులు కోర్టుకు వెళ్లారు. మరో 103 ఎకరాలు డీపట్టా భూమి. ప్రభుత్వ రికార్డుల్లో పేర్లు వున్నవారు ఎవరూ అక్కడ లేరు. వాటిని అమ్మేసుకొని వెళ్లిపోయారు. దీంతో ఈ భూములకు సంబంధించిన వారి పేర్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సేకరించిన భూమిలో ప్రభుత్వం విమానాశ్రయం కోసం 2,203 ఎకరాలు జీఎంఆర్‌కు ఇచ్చి, మిగిలిన 500 ఎకరాలను ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకొంది.
అధికారుల నిర్లక్ష్యం
జీఎంఆర్‌కు ఇచ్చిన భూముల్లో తాటిచెట్లు, కొబ్బరిచెట్లు, జీడి చెట్లు ఉన్నాయి. అన్నింటినీ తొలగించి ఖాళీ భూమి ఇవ్వాలనేది ఒప్పందం. చెట్లు తొలగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనిపై అధికారులు దృష్టి పెట్టలేదు. విమానాశ్రయం పేరుతో ఏ చిన్న పని చేయడంలేదు. ఈ జాప్యం వల్ల నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది. దీనివల్ల విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల భారం కూడా పెరుగుతుంది.