Rains in Telangana AP: మరో రెండు రోజుల వరకు ఎటువంటి అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడదు. కనుక ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు లేవు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయి. వర్ష సూచనతో ఏపీలో కొన్ని జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నేడు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రాంతాల్లో రాత్రికి చలి మొదలై తెల్లవారి వరకు కొనసాగనుంది. నవంబర్ 8 తర్వాత పరిస్ధితి మారనుంది. 


నవంబర్ 8న ఏర్పడే అల్పపీడనం, వాయుగుండంగా మారనుంది. అయితే ఇది శ్రీలంక వైపుగా వెళ్తుందా, లేదా తమిళనాడు వైపుగా వస్తుందా, తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా అనే అంశం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. బంగాళాఖాతంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీతో యానాం, తమిళనాడులోనూ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తుండగా, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. 






తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాలి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 8, 9 తేదీలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు వర్షాలు కురవనున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అనకాపల్లి, విశాఖ నగరంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో నేడు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మనకు పల్నాడు నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉంది. ఉపరితల ఆవర్తనం గాలుల కోస్తాంధ్ర వైపుగా కలవడం వలన ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. అల్పపీడనంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వలన రాత్రివేళ తేలికపాటి జల్లులు పడతాయి.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఓ రెండు రోజుల వరకు ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉన్న​తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలతో ఈ సీజన్ లో అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరుతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.