Nara Lokesh At Simhaadri Appanna Temple: సింహాద్రి అప్పన్న (Simhaadri Appanna) స్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న లోకేష్.. బేడ మండపం వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం అంతరాలయంలోని స్వామి వారిని లోకేష్ దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం అధికారులు లోకేష్‌కు స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. లోకేష్‌తోపాటు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, పల్లా శ్రీనివాస్, అదితి గజపతి, పీవీ నరసింహం, టీడీపీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు..
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురం, భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిట్టివలస, విజయనగరం జిల్లా సోంపురంలో శనివారం లోకేష్ శంఖారావం యాత్ర నిర్వహించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ మండిపడ్డారు. ఏపీకి రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాటలాడారని మండిపడ్డారు. విశాఖలో రాజధాని పేరుతో వేల కోట్లు విలువ చేసే భూములు కొట్టేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రాను మూడు కుటుంబాలకు దారాదత్తం చేశారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలకు ధారాదత్తం చేశారని, వీళ్లంతా ఎక్కడ భూములు దొరికినా, గనులు దొరికినా దోచేస్తారని మండిపడ్డారు.
జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని.. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ప్రజలను మోసగించారని మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. లిక్కర్ నిషేధించారా.? అని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 'ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంతిస్తావని అతడిని అడిగారు. ఓటమి భయంతోనే ఆయన ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చారు. జగన్ పాలనలో ముమ్మాటికీ సామాజిక అన్యాయమే జరిగింది. బీసీలంటే జగన్ కు చిన్న చూపని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. ఎర్ర బుక్ చూసి కూడా జగన్ వణుకుతున్నారు. ఆయన ఓ కటింగ్.. ఫిటింగ్ మాస్టర్ అని పచ్చ బటన్ నొక్కి రూ.10 వేసి ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాగుతున్నారు. త్వరలో గాలిపై కూడా పన్ను వేస్తారేమో. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్. రాబోయే 2 నెలల్లో జగన్ తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారు.' అంటూ మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటుందని చెప్పారు. విశాఖకు ఇచ్చిన ఏ హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విశాఖలో ఉన్న భూములను సైతం కబ్జా చేస్తున్నారని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తానన్నాడని.. ఇంతవరకు ఈ పని కూడా జగన్ చేయలేదని చెప్పారు. యువతకు ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పోయే పరిస్థితికి తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. రుషికొండలో రూ. 500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన తనయుడు కలిసి బాక్సైట్, లాటరైట్ దోచేస్తున్నారని.. అలాగే యూజీసీ సొమ్మును సైతం వాడేశారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.