Nellimerla Political Scenario Very Interesting : విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల్లో నెల్లిమర్ల ఒకటి. 2009లో నియోజకవర్గాల పునర్భిజన తరువాత ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ మూడు ఎన్నికలు జరిగాయి. నాలుగో సార్వత్రిక ఎన్నికలకు ఈ నియోజకవర్గం సిద్ధమవుతోంది. గడిచిన మూడు ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీ విజయాన్ని దక్కించుకుంది. తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిం విజయం సాధించగా, రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మూడోసారి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,04,297 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,00,679 మంది కాగా, మహిళ ఓటర్లు 1,03,612 మంది ఉన్నారు. 


మూడు ఎన్నికల్లో మూడు పార్టీల విజయం


2009లో ఏర్పాటైన నెలిమర్ల నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు మూడు విభిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. రెండు వేర్వేరు పార్టీలు నుంచి ఒకే అభ్యర్థి రెండుసార్లు విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పతివాడ నారాయణస్వామి నాయుడిపై 597 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన పీవీవీ సూర్యనారాయణపై 6993 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పతివాడ నారాయణస్వామి నాయుడిపై 28,051 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. మూడు ఎన్నికల్లో రెండుసార్లు అప్పలనాయుడు విజయం సాధించడం గమనార్హం. 


నాలుగో ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి


రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సిటింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ప్రతిపక్షాలు అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై స్పష్టత లేదు. టీడీపీ, జనసేన పార్టీలు ఇక్కడి నుంచి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. టీడీపీ ఇన్‌చార్జ్‌గా కర్రోతు బంగార్రాజు ఉండగా, జనసేన ఇన్‌చార్జ్‌ బోకం మాధవి వ్యవహరిస్తున్నారు. ఇరువురు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు తనకు చివరి అవకాశాన్ని కల్పించాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు కోరుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైన ప్రత్యర్థి కోసం చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ నియోజకవర్గంలో సీటు ఏ పార్టీకి దక్కుతుందో కొద్దిరోజుల్లో తేలనుంది.