Kurupam News: విజయనగరం జిల్లాలోని మరో నియోజకవర్గం కురుపాం. ఈ నియోజకవర్గంలో తొలిసారి 1995లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 1,94,154 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 94,786 మంది పురుషు ఓటర్లు కాగా, 99,354 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే అత్యధిక సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడి నుంచి విజయం సాధించింది. గడిచిన నాలుగు ఎన్నికల్లో టీడీపీయేతర అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ అభ్యర్థులు విజయాన్ని దక్కించుకున్నారు. 


14సార్లు ఎన్నికలు.. ఆరుసార్లు కాంగ్రెస్‌ విజయం


కురుపాం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1955లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఏఎల్‌ నాయుడు ఇక్కడ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బీఎస్‌ దొరపై 280 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఏఎల్‌ నాయుడు ఇక్కడి నుంచి విజయం సాధించారు. సీపీఐ నుంచి పోటీ చేసిన బి శ్రీరాములపై 2,227 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పీఆర్‌ఆర్‌ శత్రుచర్ల తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సీసీడీ వైరిచర్లపై 1793 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వీసీసీ దేవ్‌ ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌పీ రాజుపై 717 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్‌ విజయరామరాజు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వైరిచర్ల సిసిడీపై విజయాన్ని దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌(ఎస్‌) నుంచి పోటీ చేసిన పి సోమందొరపై 623 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1985లో జరిగిన ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వి భారతిపై 3941 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ చంద్రశేఖర్‌రాజు విజయాన్ని దక్కించుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వి ప్రదీప్‌ కుమార్‌ దేవ్‌పై 3435 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నమ్మక జయరాజ్‌ ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ చంద్రశేఖర్‌రాజుపై 32,271 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 


2004లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి పోటీ చేసిన కె లక్ష్మణమూర్తి విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక జయరాజుపై 9701 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జనార్ధన్‌ థాట్రాజ్‌ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక జయరాజుపై 15,053 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాముల పుష్ప శ్రీవాణి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జనార్ధన్‌ థాట్రాజ్‌పై 19,083 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె మరోసారి ఇక్కడ విజయం సాధించి మంత్రిగా పని చేశారు. తన సమీప ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన జనార్ధన్‌ థాట్రాజ్‌పై 26,602 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిచండంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా చేశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ విజయం కోసం ఇరు ప్రధాన పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. హ్యాట్రిక్‌ విజయం దిశగా పాముల పుష్ప శ్రీవాణి వ్యూహాలు పన్నుతుండగా, ఇక్కడ గెలిచి పరువు దక్కించుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.