MLA Ganta Srinivasa Rao inspected Rushikonda buildings: విశాఖపట్నం: రుషికొండపై అత్యంత రహస్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం రాజ భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టిందని ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మీడియాను తీసుకెళ్లి రుషికొండపై నిర్మించిన భవనాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తరహాలో భవనాన్ని అప్పటి సీఎం జగన్ దీన్ని నిర్మించారని, మొత్తం స్థలం 61 ఎకరాలు కాగా, 9.8 ఎకరాల్లో భవనాలను నిర్మించారని తెలిపారు. ప్రజల ధనాన్ని వృథా చేసి నిర్మాణాలు చేపట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. తాము ఏ తప్పు చేయలేదని, ప్రజలు అంతా గమనిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగింది.


రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని... అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదుని, విశాఖపట్నానికి గత ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టినట్లు వైసీపీ చెబుతోంది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలన్నది ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయించి, బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని పోస్ట్ చేశారు. 


ఆర్థిక రాజధాని అని చంద్రబాబు అన్నారు
‘చంద్రబాబు 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖకి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వారు వచ్చినా.. ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదు. ఇక ఇప్పుడు మీరు రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో. కానీ, దానివల్ల విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!’ అని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.






వైసీపీ ఇచ్చిన వివరణపై టీడీపీ సెటైర్లు, ప్రశ్నల వర్షం
రుషికొండలో వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఇచ్చిన వివరణపై అధికార పార్టీ మరోసారి స్పందించింది. ఒకవేశ వైసీపీ నేతలు చెప్పినట్లుగా అవి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి లాంటి వారి కోసం కట్టిన భవనాలు అని అనుకుందాం. అయితే, ఇన్నాళ్ళు అక్కడ ముళ్ళ కంచెలు ఎందుకు పెట్టావ్ ? ప్రజలకు దూరంగా ఎందుకు దాచి పెట్టావ్ ? ఎందుకు కోర్టులని మభ్య పెట్టావ్ అని టీటీపీ మరో ట్వీట్ చేసింది.



నిన్నటి వరకూ ఏపీ టూరిజం భవనాలు అని చెప్పి, ఇప్పుడు అందరిముందు దొరికిపోయాక రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్ లాంటి వారికి వసతి భవనం అని కధలు ఎందుకు చెప్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ చెప్పినట్లుగానే రుషికొండలో కట్టినవి రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన బిల్డింగ్స్ అయితే, మీ వైఎస్ జగన్ భార్య తరుపు బంధువులు అక్కడ ఎందుకు ప్రార్ధనలు చేశారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. 






విశాఖకి చంద్రబాబు ఏమి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీరు ఎంత ప్రమాదకరమో కూడా విశాఖ ప్రజలకు తెలుసు కనుక విశాఖ ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించ లేదన్నారు. బీచ్ వ్యూ ప్యాలెస్ తనకు కావాలని భార్య అడిగితే నిబంధనలన్నీ ఉల్లంఘించి, వందల కోట్ల ప్రజాధనం వృథాచేసి.. ఇప్పుడు వచ్చి కథలు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఆ బాత్ రూమ్ అంత పెద్దగా ఎందుకుంది ? అసలు ఏమి ప్లాన్ చేసావ్ జగన్ ? ఎవరికి స్కెచ్ వేశావు? అని టీడీపీ ఎక్స్ లో రాసుకొచ్చింది.


ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పాలన చేస్తే బాగుంటుందని చూడగా త్రిసభ్య కమిటీ రుషికొండను ఫైనల్ చేసిందని గతంలో ఏపీ మంత్రి ఆర్కే రోజా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ సైతం రోజా మాట్లాడిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.