Ganta Srinivasarao: రుషికొండపై అత్యంత రహస్యంగా నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం రుషికొండపై నిర్మించిన భవనాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత రహస్యంగా రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తరహాలో భవనాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా, 9.8 ఎకరాల్లో భవనాన్ని రూ.500 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారన్నారు.
ఏడు బ్లాకుల్లో సాగిన నిర్మాణాలకు ఒక్కో పేరు పెట్టారని గంటా వెల్లడించారు. పూర్వీకులు కాలంలో, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించుకున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణాలను చేపట్టారని, దీన్ని హోటల్ గా వినియోగించుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. హోటల్ మాదిరిగా వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా భవన నిర్మాణం చేపట్టారని, రివ్యూలు, సమీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం ఉందన్నారు. ఒక్కో హాల్ ను అత్యంత విశాలంగా నిర్మించారన్న గంటా.. అత్యంత వివాదాస్పదంగా, అత్యంత రహస్యంగా నిర్మాణం ఎందుకు చేశారో అని ప్రశ్నించారు.
అడుగు కూడా పెట్టకుండా దిగిపోవాల్సిన పరిస్థితి
ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న భవనంలోకి అడుగు కూడా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టుగా.. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుని తన కలల సౌదంలోకి అడుగుపెట్టకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన యువకుడు ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ పాలన సాగించడం వల్లే 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశమైన విధానాలు, పాలనలో అడ్డగోలు నిర్ణయాల వల్ల రాజధానిగా చేస్తామన్న విశాఖ ప్రాంతంలో కూడా ఆ పార్టీ నాయకులు ఘోరమైన ఓటమిని చవిచూసారన్నారు. దీని ద్వారా ఇక్కడి ప్రజలు విశాఖ రాజధాని వద్దన్న సంకేతాలను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని, ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆయన గుర్తించాలని సూచించారు. ఓటమికి గల కారణాలను సమీక్షించకుండా.. ప్రజలపై నిందలు వేసేలా మాట్లాడుతున్న ఆయన తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదన్నారు. వైసిపి మునిగిపోతున్న పడవ అని తాను ఎప్పుడో చెప్పానని, తాజా ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు.
టూరిజం రిసార్ట్స్ ను పడగొట్టి మరి నిర్మాణం
ఋషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటి ద్వారా ఏడాదికి ఎనిమిది కోట్లకుపైగా ఆదాయం వచ్చేదని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నిర్మాణాలను కూలదోసి, రుషికొండపై ఉన్న పచ్చదనాన్ని నాశనం చేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మించారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ నిర్మాణానికి సంబంధించి చెప్పిన విషయాలు కూడా అబద్ధాలుగా నిరూపితమయ్యాయని, తొలుత స్టార్ హోటల్ అని, ఆ తరువాత ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని, ఆ తర్వాత టూరిజం ప్రాజెక్టుగా చెప్పారని విమర్శించారు. నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేట్లను కూడా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. ప్రజా వేదికను కూల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమ కట్టడం అని పేర్కొన్నారని, రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాన్ని ఏమంటారో కూడా ఆయన చెప్పాలని గంటా ప్రశ్నించారు. ఈ నిర్మాణంపై పలువురు టిడిపి నాయకులు కోర్టుకు వెళితే కోర్టును కూడా బురిడీ కొట్టించేలా వ్యవహరించారని విమర్శించారు. అత్యంత ఇష్టంతో కట్టుకున్న ఈ భవనాన్ని కనీసం చూడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఆఖరికి టూరిజం మినిస్టర్ వచ్చి మూడో కంటికి తెలియకుండా ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోయారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడని, అటువంటి మూర్ఖుడు రాజు అయితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే అర్థమవుతుందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. లాజిక్, పద్ధతి లేని పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే పతనాన్ని చూశారన్నారు. రాజధాని నిర్మాణం నిలిపేయడం, పోలవరం ముందుకు తీసుకెళ్లకపోవడం, ఈ తరహా అడ్డగోలు నిర్మాణాలతో జగన్మోహన్ రెడ్డి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన సాగించారని స్పష్టం చేశారు.
ఈ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ ను కూడా వైసీపీ నాయకులకి అప్పగించారని భవన నిర్మాణానికి సంబంధించిన లెవలింగ్ పనులకు రూ.95 కోట్లు ఖర్చుపెట్టారని, ల్యాండ్ స్కేపింగ్ కు రూ.21 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అలాగే, గతంలో ఉన్న రిసార్ట్ కు ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని దాన్ని కూడా కోల్పోయేలా చేశారన్నారు.15 నెలల్లో పూర్తయ్యేలా రూ.91 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతున్నామని పనులు ప్రారంభించారని, ఎవరికీ చెప్పకుండా 20 అడుగుల బార్ కేడ్లు పెట్టి మరీ భారీ నిర్మాణాలు చేపట్టారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా చూడకుండా చేశారని గంట ఆరోపించారు. ఈ నిర్మాణంపై కొందరు హైకోర్టుకు వెళ్ళగా నిపుణులు కమిటీని హైకోర్టు వేసిందని, అనేక చోట్ల వైలేషన్స్ ఉన్నట్లు కమిటీ తేల్చిందన్నారు. అయినా, కమిటీ సిఫార్సులను ఏమాత్రం లెక్క చేయకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్నదానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆయనను తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భవనం అంతా మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లి మరి గంటా శ్రీనివాసరావు చూపించారు.