AP Cabinet Ministers News: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు సహా 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి పవన్ కి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. పలు ఇతర శాఖలకు గానూ మరో 23 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా... కేవలం 25 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడమేంటి?  చాలా మంది ఆశావహులు ఉంటారు. సీనియర్లు తమకు మంత్రి పదవి రాలేదని బాధ పడుతుంటారు. వారందరికీ శాఖలు విభజించి ఇస్తే ప్రభుత్వం సొమ్మేం పోద్ది. ఈ సందేహం చాాలా మందికి కలుగుతోంది. 


సీనియర్లకు నో.. 


రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. తెలుగు దేశం పార్టీకి విధేయుడిగా ఉన్నారు.  తెదేపాకు అనుకూలంగా వచ్చిన ఫలితాల్లో తొలి ఫలితం సైతం ఆయనదే. మరి అలాంటప్పుడు ఆయనకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు..? ఆయనకి సైతం ఏదో ఒక శాఖ కేటాయించి సంతృప్తి పరచొచ్చు కదా..? అని చాలా మందికి అనిపించక మానదు. ఈ సెంటిమెంటు బుచ్చయ్య చౌదరితోనే ఆగిపోలేదు. గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, కశావెంకట్రావు, కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామ కృష్ణం రాజు, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, ప్రత్తిపాటి  పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీ నారాయణ, నక్కా ఆనందబాబు,  ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సుజనా చౌదరి ఇలా చాలా మంది సీనియర్లు అసంతృప్తికి గురవ్వాల్సి వచ్చిందన్న భావన మంత్రి వర్గ విస్తరణ చూస్తే అనిపిస్తుంది. 


అయితే మంత్రి వర్గ విస్తరణలో ఒక్కో మంత్రికి ఒకటి కంటే ఎక్కువ శాఖలే కేటాయించడం చూశాం. మొత్తం దాదాపు 35కు పైగా ఉన్న శాఖలను విడదీసి కావాలంటే 35 మందికి సర్దుబాటు చేసే వెసులుబాటు ఉండగా కేవలం 25 మందినే మంత్రులుగా ప్రభుత్వంలోనికి తీసుకోవడమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  కానీ ఏ ప్రభుత్వమైనా తమ ఎమ్మెల్యేలను కావాలని ఎందుకు అసంతృప్తితో ఉంచుతుంది? దీనికీ ఓ కారణముంది.   


అంతకు మించి అవ్వదు.. 


ఏ రాష్ట్రంలోనైనా మంత్రి పదవులు కేటాయింపు విషయంలో ఒక నిబంధన పాటించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని ఇష్టానుసారం మంత్రి పదవులు కట్టబెడతామంటే కుదరదు. దీనికంటూ ఓ నిబంధన ఉంది. ఒక రాష్ట్రానికి చెందిన  అసెంబ్లీ పూర్తి సామర్థ్యానికి 15 శాతం మించకుండా ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఉండాలి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 175 అంటే 26 కు మించకుండా ఏపీలో మంత్రుల సంఖ్య ఉండాలి.  కేంద్ర మంత్రుల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఎన్నికైన పార్లమెంటు సభ్యుల్లో 15 శాతానికి మించకుండా కేంద్ర మంత్రి వర్గం ఉండాలి.  


విధేయతకు పట్టం.. 


చంద్రబాబు మంత్రి వర్గం చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో శాసన సభ్యులుగా ఎన్నికైన అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామిలకు తన మంత్రి వర్గంలో చోటిచ్చిన చంద్రబాబు విధేయతకు పట్టం కట్టినట్లు తెలుస్తుంది. తెదేపా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్న సమయంలో వీరంతా పార్టీకి అండగా నిలిచారు.  సామాజిక సమీకరణలు, కూటమి పార్టీలకు న్యాయం వంటి ఇతర అంశాలు మిగతా వారి ఎంపిక వెనకున్న కారణాలయ్యాయి.