రుషి కొండలో అక్రమంగా ప్రభుత్వం తవ్వకాలు చేస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రతి చిన్న విషయం సుప్రీంకోర్టే తేల్చాలంటే ఎలా అని పిటిషనర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టులో విచారణలో ఉందని అక్కడే ఏదైనా తేల్చుకోవాలని సూచించింది. 


విశాఖలో ఉన్న రుషి కొండలో ప్రభుత్వం రెండు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేస్తోందని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బయటకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రభుత్వం తవ్వేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై వాదనలు కూడా వినిపించారు. ఫొటోలు కూడా సమర్పించారు. అయినా వాదనలు వినేందుకు నిరాకరించింది. 


రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రతి సెంటు భూమికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టులో విచారణలో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబమని తెలిపింది. 


హైకోర్టులో పూర్తి విచారణ జరిగే వరకు వేచి చూడాలని సూచించింది సుప్రీంకోర్టు. ఏదైనా సమస్య ఉంటే అక్కడే తేల్చుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. 


ఈ మధ్య హైకోర్టులో ఈ రుషి కొండ వివాదంపై విచారణ జరిగింది.  నిబంధనలను అతిక్రమించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించింది. తాము మూడు ఎకరాల మేర అదనంగా తవ్వకాల జరిపామని తెలిపింది. అయితే పిటిషనర్లు మాత్రం మూడు కాదని ఇరవై ఎకరాల మేర అదనంగా తవ్వారని ఆరోపించారు. దీంతో హైకోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.


అనుమతిచ్చిన దాని కన్నా మూడు ఎకరాలు ఎక్కువ తవ్వేశామని ఒప్పుకున్న ప్రభుత్వం


విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. 


గత విచారణలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. తవ్వకాలకు సంబంధించి ఏదో దాస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది. దీంతో తమకు అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ కోరారు. ఆ మేరకు నవంబర్ మూాడో తేదీన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 


రుషికొండ తవ్వకాలు నిర్మాణాల విషయంలో అనేక అవకతవకలు


నిర్మాణాలను కూడా గతంలో కూల్చివేసిన ప్రాంతాల్లో ఎంత మేర నిర్మాణం ఉందో అంత మేరకే నిర్మాణం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ.. నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ.. కట్టడాలు ప్రారంభణయ్యాయి. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రిషికొండ కొండ తవ్వకానికి కారణం టూరిజం కాదని.. సీఎం క్యాంప్ ఆఫీస్ అన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులు వాటిని ఖండించిన వైసీపీ నేతలు .. మంత్రులు.. ఇటీవల కడితే తప్పేంటి అని ఎదురు దాడి చేయడం ప్రారంభించారు. ఈ పరిణామాలన్నీ వచ్చే విచారణల్లో హైకోర్టులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. నిబంధనలకు ఉల్లంఘించినట్లుగా తేలితే.. అధికారులను జైలుకు పంపిస్తామని హైకోర్టు గతంలోనే హెచ్చరించింది. ఇప్పటికి ప్రభుత్వమే మూడు ఎకరాలు తవ్వేసినట్లుగా చెప్పడంతో నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. తర్వాత విచారణల్లో అధికారులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.