దక్షిణాది రాజకీయాల్లో బీజేపీ పార్టీ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. స్థానిక అంశాలపై కూడా అధిష్ఠానమే ఫాలో అప్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలోలా రాష్ట్ర నాయకుల ద్వారా సమాచారాన్ని కేడర్‌కు చేరవేసే పద్దతికి బదులుగా డైరెక్ట్‌గా ఢిల్లీ పెద్దలే ప్రతీ విషయాన్నీ ఫాలో అప్ చేస్తున్నారు. తాజాగా విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ఫిక్స్ కావడం లో ఈ విషయం రుజువైంది అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. 


గురువారం సాయంత్రం నుంచి పవన్ కల్యాణ్ వైజాగ్ వెళుతున్నారనీ..శుక్రవారం నాడు ప్రధానితో భేటీ అవుతున్నారనీ టీవీల్లో బ్రేకింగ్స్ పడుతున్నా...ఆ అంశం పై బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి సమాచారం లేదు. చివరకు రాత్రి 8 గంటలు దాటాక మాత్రమే వారు అధికారికంగా ప్రకటించగలిగారు. మొత్తం వ్యవహారాన్ని పీఎంవో, బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే డీల్ చేశాయి. అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వైజాగ్ వస్తున్న ప్రధానితో రోడ్ షోకు ఒప్పించగలిగామని సంబరపడ్డారు రాష్ర్ట బీజేపీ నాయకులు. కానీ మోదీ, పవన్ భేటీ సమాచారం ముందుగా లేదన్న విషయం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. 


గతంలో కూడా పవన్ కల్యాణ్ ఇదే అంశాన్ని పరోక్షంగా తెలిపారు. రాష్ట్ర సమస్యలపై తన వాదనను డైరక్ట్‌గా బీజేపీ కేంద్ర నాయకత్వంతోనే మాట్లాడుకుంటానంటూ ఓ సందర్భంలో అన్నారు. దానితో దక్షిణాది కసంబంధించి ఇకపై కీలక అంశాలను డైరెక్ట్‌గా డీల్ చెయ్యాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తుంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో పూర్తిస్థాయి ప్రభావం చూపాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిస్థితిలో ఇకపై హైకమాండ్ డైరెక్ట్‌గానే తన నిర్ణయాలను అమలు చేస్తోంది అంటున్నారు. 


ఇలాంటి కొన్ని కీలక విషయాల్లో స్థానిక నాయకత్వానికి సమాచారం అందక పోవడం మాత్రం బీజేపీలో నయా ట్రెండ్ అనే చెప్పాలి. గతంలో తెలంగాణలో జరిగినట్టు ఆరోపణలు ఉన్న ఒక అతిపెద్ద వ్యవహారంలోనూ స్థానిక నాయత్వానికి తెలియకుండానే వ్యవహారం నడిచింది అన్న అనుమానాలు ఉన్నాయి. దీనితో లోకల్ లీడర్ షిప్‌ను బైపాస్ చేసి పార్టీ హైకమాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనులు చక్క బెడుతోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి.