శ్రీకాకుళం జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్న ఎలుగుబంటిన అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసి అటవీ సిబ్బంది దాన్ని పట్టుకున్నారని తెలుస్తోంది. కిడిసింగిలోని పశువుల పాకలో అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ షూట్ చేశారు. కాసేపటికి అది చలనం లేకుండా పడి ఉన్న సమయంలో అటవీ సిబ్బంది ఎలుగు బంటిని పట్టుకున్నారు. ఎవరినీ కరవకుండా దాని మూతిని గట్టిగా కట్టేసి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు గంటల రెస్క్యూ ఆపరేషన్ తరువాత ఎలుగుబంటిని అధికారులు పట్టుకున్నారు. ఎలుగుబంటి ఉన్న స్థలాన్ని డ్రోన్ కెమెరా తో పరిశీలిస్తున్నారు. మరోవైపు కిడిసింగి గ్రామస్తులు కాగడాలతో సిద్ధంగా ఉన్నారు.


స్థానికులు హర్షం..
ప్రాణ భయంతో ఉన్న తమకు ఎలుగుబంటిని అటవీ అధికారులు పట్టుకున్నారన్న వార్త సంతోషాన్ని కలిగించిందని వజ్రపుకొత్తూరు స్థానికులు చెబుతున్నారు. ఇక తాము హాయిగా నిద్రపోతామని, పొలం పనులకు ఏ భయాలు లేకుండా వెళ్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి సోమవారం మరోసారి దాడి చేసింది. ఎలుగు దాడిలో ఏడుగురికి  తీవ్రగాయాలు కాగా, చికిత్స అందించేందుకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎలుగు బంటి దాడులు వరుసగా జరుగుతున్నా అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయంటూ  స్దానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లాలన్నా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. ఎలుగుబంటి ఎక్కడ తమపై దాడి చేస్తుందోనన్న భయమే వారిని ఏ పని చేయకుండా చేస్తుందని సోమవారం వాపోయారు.  


ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి చేసిన దాడిలో కలమట కోదండ రావు(50) అనే అన్నతాద మృతి చెందాడు. ప్రతిరోజూ లాగే ఉదయం నిద్ర లేచిన కోదండ రావు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఎలుగు దాడితో ప్రాణ భయంతో ఆయన గట్టిగా కేకలు వేశారు. దగ్గర్లో ఉన్నవారు అక్కడికి వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది. ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Also Read: Konaseema Rains: కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు, పిడుగుపాట్లు - కొన్నిచోట్ల పాడైన గృహోపకరణాలు 


మరోవైపు కాకినాడ జిల్లాను రాయల్ బెంగాల్ టైగర్ గజగజ వణికిస్తోంది. దాదాపు నెల రోజులుగా కాకినాడ జిల్లాల్లో సంచరించిస్తున్నా అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని మాత్రం పట్టుకోలేకపోయారు. పైగా తాము చెప్పిన తరువాత వచ్చి అటవీ అధికారులు పులి జాడ గుర్తించామని చెబుతున్నారంటూ జిల్లా వాసులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో త్వరగా చికటి పడుతుండగా, ఇంటికి తిరిగి వెళ్లాలంటేనే పులి, ఎలుగు బంటి భయాలతో ఆ జిల్లాల్లో మహిళలు, చిన్నారులతో పాటు పురుషులు సైతం ప్రాణ భయంతో వణికిపోతున్నారు.


 Also Read: Srikakulam జిల్లాలో మరోసారి ఎలుగుబంటి దాడి, పెద్ద పులితో కాకినాడలో గుండె దడదడ - 2 జిల్లాలను వణికిస్తున్న ఎలుగు, బెంగాల్ టైగర్