రెండు రోజులుగా కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడుతున్నాయి. ఉదయం నుంచి పిడుగులు కూడా ఎక్కువ పడుతుండటంతో రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడి రోడ్లపై పడుతున్నాయి. విద్యుత్తుకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాంతాలు జలమయమయ్యాయి. పిడుగుల ధాటికి పలుచోట్ల గృహోపకరణాలు ధ్వంసం అయ్యాయి.
తృటిలో తప్పిన పెను ప్రమాదానికి కారణం ట్రాన్స్ కో సిబ్బంది నిర్లక్ష్యమే..!
అల్లవరం మండలం తుమ్మల పల్లి గ్రామ పరిధిలోని రోడ్డు పై పడిన భారీ వృక్షం ప్రమాదవశాత్తు పడిందని అందరు అనుకున్నారు. కానీ
ట్రాన్స్ కో సిబ్బంది నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. సోమవారం కురిసిన వర్షానికి అల్లవరం నుంచి బెండమూర్లంక 33 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ కు వెళ్లిన విద్యుత్తు లైన్ తుమ్మలపల్లి వద్ద బారీ మామిడి వృక్షానికి తగులుకోవడంతో మంటలు చెలరేగాయి. అయితే స్థానికులు స్థానిక లైన్ మేన్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని విద్యుత్తు సరఫరాను నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
అయితే అప్పటికే భారీ మామిడి వృక్షానికి ఉన్న పెద్ద కొమ్మ సగానికి పైగా కాలిపోయింది. అయితే అది అలానే వదిలేశారు. మళ్లీ విద్యుత్తు పునరుద్ధరించి అక్కడినుంచి వెళ్లిపోయారు. 33 కేవీ లైనుకు మళ్లీ విద్యుత్తు సరఫరా కావడం తో మళ్లీ హైటెన్షన్ తీగలు మామిడి వృక్షానికి ఉన్న పెద్ద కొమ్మకు తగులుకోవడంతో మళ్లీ మంటలు వ్యాపించాయి. దీంతో హైటెన్షన్ తీగ తగిలిన ప్రాంతంలో భారీ కొమ్మ కాలిపోయి ఉన్న ఫళంగా కొమ్మ విరిగి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో అమలాపురం నుంచి బెండమూర్లంక వైపుగా వస్తున్న మలికిపురంకు చెందిన కొమ్మూరి సత్యనారాయణకు చెందిన కారు ఈ ప్రమాదంలో భారీ కొమ్మకింద ఇరుక్కుని ధ్వంసం అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ తలకు తీవ్రగాయాలు కాగా కారు డ్రైవరు చిన్నా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భారీ కొమ్మ రోడ్డుపై వెళుతున్న కారుపై పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్ కో సిబ్బంది నిర్లక్ష్యంతో ఖరీదైన కారు ధ్వంసం కావడమేకాకుండా ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని స్థానికులు మండిపడ్డారు.