Tiger Search Continue in Kakinada: forest officials unable to catch Royal Bengal Tiger
కాకినాడ జిల్లాలో తిష్ట వేసిన బెంగాల్ టైగర్ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ శాఖ అధికారులకు సైతం చిక్కకుండా ముప్పు తిప్పులు పెడుతోంది. నెల రోజులు కావొస్తున్నా అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తరచుగా వేరు ప్రాంతాలకు వెళ్తూ తన మకాం మారుస్తోంది కానీ బోనులోకి మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ప్రత్తిపాడు మండలం పెద్ది పాలెం, కిత్తమూరి పేట గ్రామ సమీపంలో పులికోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్తిపాడు మండలం లొద్దుపాలెంలో పులి ఆనవాళ్లు అటవీశాఖాధికారులు కనుగొన్నారు.
ఎక్కడెక్కడ గాలిస్తున్నారంటే..
లొద్దుపాలెము నుండి తాడువాయి కొండ పైకి వెళ్లినట్లు పులి అడుగులు కనిపించాయి. మరోవైపు కిత్తుమూరిపేటలో చంద్రబాబు సాగర్ నుండి అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. ప్రస్తుతం పులి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని చెబుతున్నారు. పులి ఎక్కడికి పోలేదని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అధికారులు ఇలా చెపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులుగా ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను పెద్దపులి వణికిస్తోంది. మూడు మండలాల పరిధిలో 15కు పైబడి గ్రామాల్లోప్రజలు భయం భయంగా ఉన్నారు. అటు అటవీశాఖ అధికారులకు, ఇటు స్థానిక ప్రజలకు బెంగాల్ టైగర్ చుక్కలు చూపిస్తోంది.
రోజుకో ప్లేస్ మార్చుతూ ముప్పు తిప్పలు..
కాకినాడ జిల్లాలో నెల రోజులుగా పులి తిష్టవేసింది. పెద్దపులి దాడిలో ఇప్పటివరకు 25కు పైగా పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ ఓ వైపు అధికారుల బోనులో చిక్కకుండా, మరోవైపు రోజుకో ప్లేస్ మార్చుకుంటూ జిల్లాల్లో పలు మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పెద్దపులి భయంతో ఉపాధి పనులు వెళ్లలేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తొలకరి పంట వేసుకునేందుకు మూడు మండలాల రైతులు వెనకాడుతున్నారు. వర్షాలు దండిగా కురుస్తున్నా పులి భయం నీడలా వెంటాడుతుండడంతో పొలం వైపు కన్నెత్తి చూడలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం వెళ్లాలంటే భయం భయంగా ఉందని అన్నదాతలు చెబుతున్నారు.
చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న బెంగాల్ టైగర్
మూడు మండలాల పరిధిలో 2వేల ఎకరాలకు పైబడి వరి, 6 వేల ఎకరాలకు పైబడి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. రెండు సార్లు బోనుకు చిక్కినట్లే చిక్కి తప్పించుంది బెంగాల్ టైగర్. ఆరు బోన్లు ద్వారా పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. పులి పాదముద్రలు గుర్తించడంతోనే కాలం వెల్లదీస్తున్నారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర తడోబా బృందం నేటికీ రాలేదు.