AP Minister Dharmana Prasada Rao: ఏపీలో మూడు రాజధానుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని రాజధాని చేయకపోతే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ను ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తెర మీదకు తెస్తున్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అని అమరావతిని ప్రకటిస్తే, విశాఖ కేంద్రంగా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్మించిన సిసి రోడ్లును మంత్రి ధర్మాన ప్రసాద రావు మంగళవారం ప్రారంభించారు.  


అనంతరం మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. ధర్మాన ప్రసాద రావు భూములు దొబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రెవిన్యూ మినిస్టర్ గా సేవలు అందిస్తూన్నా సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా తనకు లేదన్నారు. అలాంటిది రెవెన్యూ మంత్రిగా భూములు కొట్టేసే అవకాశం తనకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్ మాత్రమే ఎవరికైనా భూములు ఇవ్వగలదు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ పనికైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నానని రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండి
తాను ఏ అవినీతికి పాల్పడలేదని, ఎవరి భూములు తీసుకోలేదన్నారు. దమ్ముంటే తన పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని నిజాయితీగా నిలబడమనాలని, నేను నిరూపిస్తాను.. చంద్రబాబు వేటిలో అక్రమాలు చేశాడో చూపిస్తానన్నారు. మా ప్రాంతం ఉత్తరాంధ్ర కోసం మాట్లాడితే తనను అవినితి పరుడినని ముద్ర వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా, కానీ మా ప్రాంత ప్రజల కోసం గోంతెత్తకుండా ఉండేది లేదన్నారు మంత్రి ధర్మాన.  
అధికార పార్టీనైనా ప్రశ్నిస్తా 
తన ప్రాంత ప్రజల కోసం ఎక్కడివరకైనా వెళ్తానని, అధికార పార్టీలో ఉన్నా తమ ప్రజలకోసం అధికార పార్టీనైనా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ఓటేయమని అడగను, కానీ ప్రజలకు ఇష్టమైతే వేస్తే వేస్తారు లేకపోతే లేదు. ఓటేసినందుకు ప్రజలకోసం కష్టపడి పనిచేస్తా అన్నారు. దోపీడీని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు, బీదవారికి పథకాల ఫలాలు పంచవచ్చు. మీలాంటి దోపిడీ దారులను కంట్రోల్ చేస్తున్న నేత జగన్. ఓకే రాజధాని  అని అమరావతి పేరును చంద్రబాబు ప్రకటిస్తే.. మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఒప్పుకునేది లేదన్నారు. విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఉత్తరాంధ్ర ప్రజలం పూర్తిగా వెనుకబడి ఉన్నాం, జెట్టీలు లేవు, హార్బర్లులేవు, గ్రామాల్లో త్రాగునీరు లేదన్నారు. మేం అసేంబ్లీకి సమస్యలకు అడగడానికే వెళ్తున్నామని, సైలెంట్ గా ఉండే వ్యక్తి ధర్మాన ప్రసాదరావు కాదని, తన ప్రజల కోసం గళం విప్పుతానన్నారు. 


సంస్కరణలు చేసే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని.... అది ప్రభుత్వాల తప్పుకాదని... అర్థం చేసుకోని వారి తప్పని కామెంట్ చేశారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అందుకే తమ ప్రభుత్వంపై కూడా అలాంటి వ్యతిరేకత ఉందన్నారు.