తూరుపు తెలవారగానే.. స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ జనంలోకి వెళ్లిపోతారు. వారి బాగోగులు వింటారు. ఏమైనా సమస్యలు ఉంటే..అక్కడికక్కడే పరిష్కరిస్తారు. 'గుడ్ మార్నింగ్ ఆమదాలవలస' అంటూ పురవాసులను పులకింపజేస్తున్నారు తమ్మినేని. నేనున్నానంటూ.. వారిలో భరోసా నింపుతున్నారు. 


స్పీకర్ స్థాయి వ్యక్తి తెల్లవారేసరికి వచ్చి.. సొంత మనుషుల్లా.. పలకరించి, బాగోగులు తెలుసుకునేసరికి.. ఆమదాలవలస పుర ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారి కష్టాలు.. ఆయన.. ఆయన కష్టాలు వారు తెలుసుకుంటున్నారు. తమ బాధలను నేరుగా వినేందుకు స్పీకర్ వస్తుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ల నుంచి ఈ ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతోంది.


ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బొడ్డేపల్లిపేటలో సర్వే నెంబర్ 30లో 20 ఎకరాల 14 సెంట్లు విస్తీర్ణం గల చెరువు ఆక్రమణకు గురైందని, నోటీసులు ఇచ్చి వెంటనే తొలగించాలని సభాపతి తమ్మినేని సీతారాం ఆదేశించారు. పది ఎకరాల వరకు చెరువు ఆక్రమణకు గురైనట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. 


'గుడ్ మార్నింగ్ ఆమదాలవలస' కార్యక్రమంలో భాగంగా మంగళవారం 18వ వార్డు బొడ్డేపల్లిపేట వార్డులో పర్యటించారు. ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడుతూ గడిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని, పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రజల సహకారంతో ముందుకు వెళ్లాలని అధికారులను సూచించారు. 


అదేవిధంగా ఆ వార్డులో ఉన్న పాఠశాల శిథిలావస్థకి చేరిందని, పాఠశాలకు పిల్లలను పంపించడానికి భయమేస్తుందని తల్లిదండ్రులు స్పీకర్‌కి వివరించగా.. 'నాడు- నేడు' సెకండ్ ఫేజ్‌లో పెట్టి ఆ పాఠశాలను ఆధునీకరించాలని సంబధిత అధికారులకు ఆదేశించారు. బొడ్డేపల్లి పేట నుంచి పూజారిపేట 30 అడుగుల రహదారి, కాలువలు నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.


దీనిపై  ప్రతిపక్షం మాత్రం సెటైర్లు వేస్తోంది. స్పీకర్‌ మార్నిగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారని విమర్శలు చేస్తోంది. వాకింగ్, టాకింగ్ తప్ప పనులు ఏమీ జరగడం లేదని ఆరోపణలు చేస్తోంది టీడీపీ. ఇలాంటి గతంలో కూడా చేశారని ప్రజల్లో వ్యతిరేకత తగ్గించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 


ఎన్నికలకు చాలా టైం ఉంది కదా ఇంటి ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారా అని సామాన్య ప్రజల్లో చాలా మందికి అనుమానం వస్తుంది. 2024 టార్గెట్‌గానే స్పీకర్‌ ప్రయత్నాలు మొదలు పెట్టేశారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి  వరకు స్పీకర్‌గా పని చేసిన లీడర్ ఎవరూ తర్వాత ఎన్నికల్లో గెలిచింది లేదు. అందుకే తమ్మినేని జాగ్రత్త పడుతున్నారని అమదాలవలస జనం అభిప్రాయపడుతున్నారు. 


గతంలో చాలా మంది నేతలు స్పీకర్‌ అనే చట్రంలో ఇరుక్కపోయి ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అందుకే వాళ్లంతా తర్వాత ఎన్నికల్లో ఘోర పరాభవం రుచి చూశారు. అందుకే వాళ్ల కంటే భిన్నంగా తమ్మినేని వెళ్తున్నారు. రెండేళ్ల క్రితమే ఈ గుడ్‌మార్నింగ్ అమదాలవలస పేరుతో జనాలకు చేరువుగా ఉంటున్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న తమ్మినేనికి ఈసారీ నిరాశ తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మంత్రిని అనిపించుకోవాలన్న టార్గెట్‌గానే పని చేస్తున్నారు.