ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నం బాట పట్టారు. గతంలో శారదా పీఠాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి మళ్ళీ ఇన్నాళ్ళకి ఏపీ పర్యటనకు వచ్చి విశాఖలో ఉన్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ (Haryana CM Manohar Lal Khattar)ను కలవడం కోసం స్టీల్ సిటీకి వస్తున్నారు. మరో వైపు హర్యానా సీఎం కూడా గత కొన్ని రోజులుగా విశాఖలోనే ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ఒక వెల్ నెస్ రిసార్ట్ లో నేచురోపతి చికిత్స తీసుకుంటున్నారు మనోహర్ లాల్ ఖట్టర్. ఢిల్లీలోని ఒక పెద్ద హాస్పిటల్ యాజమాని అయిన సతీష్ జీ  అనే ఆయన రిఫరెన్స్‌తో ఆయన స్నేహితుడికి చెందిన విశాఖలోని వెల్ నెస్ సెంటర్‌కు హర్యానా సీఎం వచ్చారు. ఈనెల 20 వరకూ వైజాగ్ లోనే ఉంటారు. పనిలోపనిగా సింహాచలం, రిషికొండలోని బాలాజీ ఆలయాలను దర్శించుకున్న కట్టర్ విశాఖలోని శారదా పీఠాన్ని కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు ఆయన్ని కలవడం కోసం ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా వైజాగ్ కు వస్తున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 


సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్.. 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10:25 నిమిషాలకు ఏపీ సీఎం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11:05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి దాదాపు 12 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు చేరుకుంటారు. ఏపీలో పర్యటిస్తున్న హర్యానా సీఎం ఖట్టర్‌తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అసలు ఏ విషయాలపై వీరు చర్చిస్తారు. ఎందుకు ఈ భేటీ అనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. హర్యానా సీఎంతో భేటీ అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి ఏపీ సీఎం జగన్ చేరుకోనున్నారు.


ఖట్టర్ రాక గురించి ముందే సమాచారం
గతంలో ఏపీ సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవాలు హాజరైనప్ప్పుడు త్వరలో హర్యానా సీఎం వస్తున్నారని అప్పుడు మళ్ళీ వైజాగ్ కి వస్తానని  అక్కడి వారికి తెలిపినట్టు శారదా పీఠం వర్గాలు చెబుతున్నాయి. అన్నమాట ప్రకారమే ఆయన వైజాగ్ కి వచ్చారు. అలాగే కట్టర్ కూడా శారదా పీఠంను దర్శించుకున్నారు. ఇప్పడు ఈ ఇద్దరు సీఎంల భేటీ దేనికోసం అనేది ఇతర పార్టీల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా విశాఖలోనే ఉన్నారు. మర్యాదపూర్వకంగా అన్నా ఆయన్ను సీఎం జగన్ కలుస్తారు అనుకున్న వారికి సీఎం షెడ్యూల్ షాకిచ్చింది. కట్టర్ తో భేటీ తరువాత వెంటనే జగన్ తాడేపల్లికి తిరిగివెళ్ళనున్నారు. సాధారణంగా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఆస్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు వారు వెళ్లి రాష్ట్ర  సీఎంను కలవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పడు జరుగుతుంది మాత్రం రివర్స్‌గా ఉంది. హర్యానా సీఎంను కలవడం కోసం ఆఘమేఘాల మీద జగన్ ఎందుకు వచ్చారు  అనేది అర్ధం కావడం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


హర్యానా సీఎంను జగన్  కలిసేది అందుకేనా ?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదుగుతోన్న బీజేపీకి ఆ పార్టీ కాక వేరే ప్రాంతీయ పార్టీ నుండి నమ్మకమైన వ్యక్తి లేరు. కానీ ఏపీ సీఎం జగన్ దక్షిణాది రాష్ట్రాల నుండి వారికి నమ్మదగ్గ నాయకుడుగా కనిపిస్తున్నారు. బీజేపీ ఏం చేసినా మద్దతు ఇస్తున్న జగన్ వారికి మరింత చేరువ కావాలని చూస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు భావజాలం పరంగా, అధికారం పరంగా ప్రధాని నరేంద్ర మోదీని కావాల్సినప్పుడు కలుసుకునే నేతల్లో ఒకరిగా మారుతున్నారు .


అందుకే వారి గుడ్ లుక్స్‌లో ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారని అందుకే అతిచిన్న రాష్ట్రం అయినా, హర్యానా సీఎంతో భేటీ కోసం జగన్ స్వయంగా బయలుదేరి వైజాగ్ వచ్చారని ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏంటంటే ఇదే విశాఖలో టీటీడీ ప్రత్రిష్టాత్మకంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన సీఎం రాక కోసం నిర్మాణం పూర్తి చేసుకుని మరీ నెలల తరబడి ఎదురు చూసినా చివరకు జగన్ రాకుండానే ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ నేచురోపతి చికిత్స తీసుకోవడానికి ఎక్కడో హర్యానా నుంచి విశాఖ వచ్చిన మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవడానికి మాత్రం జగన్ వైజాగ్ బాట పట్టారు. ఈ రెండు సంఘటనలకూ విశాఖ శారదా పీఠం సాక్షిగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Nellore: కాకాణి Vs అనిల్, సెకండ్ పార్ట్ మొదలు - ఒకరి ఇలాకాలో ఇంకొకరు ఎంట్రీ! అసలేం జరుగుతోంది?


Also Read: Jagan Vizag Tour: ఊరి వాకిటికి ఉపరాష్ట్రపతి వస్తేనే వెళ్ళని సీఎం జగన్- వైజాగ్ వెళ్లి హరియాణా సీఎంను కలవడం ఎందుకు ?