BJP Leaders: రెండు రోజుల పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు విశాఖకు వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేడు ఏపీలో రూలింగు కాదు, ట్రేడింగ్ జరుగుతోందంటూ సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకార బంధురం అవుతోందని తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ పార్టీల స్వార్ధ అవినీతి పాలనే ఇందుకు కారణమని వివరించారు. బీజేపీతో దోబూచులాడాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. 2024లో అధికారానికి రావటమే లక్ష్యంగా బీజేపీ ఐదు వేల వీధి సభలు నిర్వహిస్తుందని తెలిపారు‌. విశాఖలో ఈ రోజే ఈ సభలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్లు, 80 లక్షల మందికి నెల నెలా బియ్యం ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 2.7 కోట్లమంది ప్రజలు ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి మోదీజీ పధకాల ద్వారా వచ్చిన‌ లబ్ధి పొందుతున్నారని సోము వీర్రాజు వివరించారు. ఎనిమిదేళ్లు ఏలిన పార్టీలు ఏం మేలు చేశాయని ప్రశ్నించారు. మూడు రాజధానులు ఏమిటని నిలదీశారు. 


మత్స్యకారుల కోసం జెట్టీలు కట్టమంటే..


చత్తీస్ గడ్ కోసం నయా రాయపూర్లో రాజధాని కట్టారని తెలిపారు. గుజరాత్ లో గాంధీ నగర్ కట్టారని, ఇక్కడ మాత్రం ఎనిమిదేళ్లయినా రాజధానికి రూపూ రేఖా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు పెడితే అభివృద్ధి జరిగిపోదని... ప్రతి జిల్లానీ అభివృద్ధి చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన పధకాలు అమలు చేస్తే అభివృద్ధి జరిగేదని... కానీ వైసీపీ ప్రభుత్వం చేయటం లేదన్నారు. మేము కూడా వారిలా మైండ్ గేమ్ ఆడగలమని తెలిపారు. సంక్షేమ పధకాలతో సర్జికల్ స్ట్రైక్ వంటిది జరుపుతామని హెచ్చరించారు. యూపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఎస్పీ, బీఎస్పీలను తుడిచి పెట్టామని గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీల గతి ఇంతేనని ఎద్దేవా చేశారు. 900 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు జెట్టీలు కట్టమని డబ్బులిస్తే కట్టలేకపోయారని ఆరోపించారు.


భూమిని కూడా సేకరించలేకపోయారు..


మీ నాయకత్వం సమర్దంగా లేదంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ తెలిపారు. ప్రజలు అవస్థ పడుతున్నారని.. అది మీకు కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు తాము అండగా ఉంటామని తెలిపారు. మద్యం అమ్మకాలు డిజిటల్ గా ఎందుకు నడపరు, పేటిఎమ్ ద్వారా ఎందుకు అమ్మరు అని ప్రశ్నించారు. కేవలం ఆ డబ్బు లెక్కలు తెలియకుండా చేయటానికే నగదు లావాదేవీలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైనుకి భూమి సేకరించలేక పోయారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు గేట్లు పాడైతే రిపేరు చేసే దిక్కులేదంటా ఫైర్ అయ్యారు. పోలవరానికి కేంద్రం డబ్బులిచ్చినా కట్టలేకపోతున్నారని స్పష్టం చేశారు. అక్కడ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని జీవీఎల్ ప్రశ్నించారు. ఇలా ఒకటా, రెండా, ఎన్నో అరాచకాలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్వాసితులకు ఎందుకు పరిహారాలు ఇవ్వరని...సోషియో, ఎకనమిక్ సర్వేలు ఎందుకు చేయరంటూ నిలదీశారు. 


నాడు టీడీపీ, నేడు వైకాపా కూడా ప్రజల గురించి పట్టించుకున్నదే లేదని... ప్రజాపోరు యాత్రలో ఇవన్నీ చెప్తామని పేర్కొన్నారు. విశాఖలో గత మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. ఇపుడు రాజధాని ఇక్కడ పెడతామంటున్నారని అడిగారు. ఒక ఇఎస్ఐ ఆస్పత్రి కడతామంటే కూడా వైసీపీ ప్రభుత్వం స్థలం ఇవ్వలేకపోయిందని... అమరావతి రైతుల యాత్రను అడ్డుకునే హక్కు వైకాపాకు లేదని అన్నారు.