ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను అదానికి ఇవ్వాలని నిర్ణయించడం పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు రిటైర్డ్ కేంద్రప్రభుత్వ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ. ముఖ్యమంత్రి జగన్‌కు లెటర్ రాసిన శర్మ... పార్వతీపురం మాన్యం జిల్లాలో రెండు ప్రాజెక్టులు (కురుకుట్టి దగ్గర  1,200MW హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, కర్రివలస దగ్గర 1,000MW హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్) అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎర్రవరం దగ్గర 1,200MW హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఆదానీ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించడం చట్టల ఉల్లంఘన అని తెలియజేశారు. 


 పీసా, అటవీ హక్కుల చట్టాల కింద ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు అక్కడి గ్రామ సభలను సంప్రదించి వారి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు శర్మ. గ్రామసభల అనుమతి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రాజెక్టుల మీద, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు 2013 ఏప్రిల్ 18న వేదాంత కేసులో చెప్పిందని వివరించారు. ఒడిశాలోని కలాహండి, రాయగడ జిల్లాల్లో అక్కడి ప్రభుత్వం, గ్రామ సభల అనుమతి లేకుండా వేదాంత కంపెనీకి బాక్సైట్ మైనింగ్ అనుమతి ఇవ్వడాన్ని చట్టవిరుద్ధమని కోర్టు తేల్చిందని తెలిపారు.  


ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పాటించాల్సి ఉందన్నారు శర్మ. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ పదకొండు గ్రామాల్లో గ్రామసభలు ఆ మైనింగ్ ప్రాజెక్టును చర్చించి, తిరస్కరించడం వలన ప్రాజెక్టు రద్దైన సంగతిని కూడా గుర్తు చేశారు. ఇదే కాకుండా  షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజ్ తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందన్నారు. సుప్రీం కోర్టు వారు, అప్పటి విశాఖపట్నం జిల్లా  షెడ్యూల్డ్ ప్రాంతంలో అనంతగిరి మండలంలో ఒక ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన నిర్ణయాన్ని 1997లో సమతా కేసులో రద్దు చేశారన్నారు. ఆ కారణంగా, ఈ మూడు హైడ్రో ప్రాజెక్ట్‌లను అదానీ కంపెనీకి  ఇవ్వడం చెల్లదని గుర్తించాలన్నారు. 


రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ పారా 4 కింద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (Tribal Advisory Council), ఇటువంటి ప్రాజెక్టుల మీద చర్చించవలసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కౌన్సిల్‌ అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజెక్టుల మీద నిర్ణయం తీసుకోవడం, రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లు అవుతుందని తెలిపారు. 


షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనుల జీవితాల మీద, వారి సంప్రదాయం మీద ప్రభావం కలిగించే పెద్ద ప్రాజెక్టులు పెట్టే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం 338A(9) కింద జాతీయ స్థాయి ట్రైబల్ కమిషన్ (National Commission for the Scheduled Tribes- NCST) అభిప్రాయాన్ని ముందే తీసుకోవాలని గుర్తు చేశారు శర్మ. ఏపీ ప్రభుత్వం NCST తో ఎటువంటి సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదని అనుమాన పడ్డారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అదానీ కంపెనీకి, ఎటువంటి పోటీ లేకుండా, ఇవ్వడం సరికాదని...  కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ విధానం" ప్రకారం, పోటీ లేకుండా హైడ్రో ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం చెల్లదన్నారు. 


ఈ మూడు ప్రాజెక్టు వలన, గిరిజన ప్రాంతాల్లో వారి జీవితాలకు, సాంస్కృతికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వారు ఆధారపడే జలవనరులకు అంతరాయం కలుగుతుంది. అటవీ హక్కుల చట్టం క్రింద, వారికి అక్కడ అటవీ సంపద మీద ఉన్న హక్కులకు అంతరాయం కలుగుతుంది. ఇన్ని విధాలుగా గిరిజన ప్రజలకు నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నా, వారితో, వారి గ్రామసభలతో ముందుగా సంప్రదించకుండా, ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్‌ల మీద ఏకపాక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హైడ్రో ఎలక్ట్రిక్ విధానాన్ని ఉల్లంఘిస్తూ, ప్రాజెక్టులను అదానీ కంపెనీకి పోటీ లేకుండా ఇవ్వడం సబబు కాదన్నారు. 


ఈ విషయాలపై ఎన్నోసార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసినా స్పందించలేదని వాపోయారు శర్మ. ఇప్పటి లేఖలకు తన లేఖలను జతపరిచారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, తక్షణం, ఈ మూడు ప్రాజెక్టులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాలలో అమలులో ఉన్న చట్టాలను, గిరిజనుల హక్కులను గౌరవిస్తూ ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటారని విశ్వసిస్తున్నాను అని అభిప్రాయపడ్డారు.