Andhra Pradesh News | శ్రీకాకుళం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం, విమాన మార్గాల విస్తరణపై ఫోకస్ చేస్తూనే, సొంత జిల్లా శ్రీకాకుళంపై సైతం ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం భావనపాడులో ఫిషింగ్ హార్బర్ (Fishing Harbor) ఏర్పాటు చేయాలని.. గార మండలం కళింగపట్నంలో, వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని రామ్మోహన్ నాయుడు సోమవారం కేంద్ర నౌకాయన శాఖ మంత్రి సర్బానంద సోనోవాలను కోరారు. ఈ మేరకు సోనోవాల్‌కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. 


సర్బానంద సోనోవాల్‌కు రాసిన లేఖలో ఏముందంటే..


‘శ్రీకాకుళం జిల్లాలో 194 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఇందులో రెండు వందలకు పైగా మత్స్యకారులు అధికంగా ఉన్న గ్రామాలు ఉన్నాయి. స్థానికంగా వీరికి ఉపాధి అవకాశాలు దొరకకపోవడంతో వేరే ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు సైతం వలస వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు వలసలు అధికంగా ఉంటున్నాయి. కనుక జిల్లాలోని భావనపాడులో ఫిషింగ్ హార్బర్, కళింగపట్నం, మంచినీళ్ల పేటలలో ఫిషింగ్ జెట్టీలు నిర్మించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఈ పనులు పూర్తి చేస్తే కనుక స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. శ్రీకాకుళం నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం వలసలు తగ్గుతాయి’ అని రామ్మోహన్ నాయుడు తన లేఖలో పేర్కొన్నారు.