Praja Shanti Party KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై తాను ఎంతదూరమైనా వెళ్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు కోసం గురువారం ఢిల్లీకి వెళుతున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఢిల్లీలో కేంద్రం పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రూపాలా లాంటి వారిని కలుస్తానని చెప్పారు. తనతో పాటు లక్ష్మీ నారాయణతో పాటు టీడీపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీల నుండి ప్రతినిధులు ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఢిల్లీ పెద్దలను కలిసేందుకు తనకు ఎలాంటి అప్పాయింట్ మెంట్ అవసరం లేదన్నారు. అందుకే మిగతా పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు తనతో పాటు వస్తే అపాయింట్ మెంట్ లేకుండా మోదీ, షాలను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై చర్చించే అవకాశం ఉందన్నారు.
గుజరాత్ భూకంపం సమయంలో మొట్ట మొదటిసారిగా సాయం కోసం ప్రయత్నించింది తానే అన్నారు. దాయాది పాకిస్తాన్ కు కూడా ఆర్థిక సాయం చేశానని కేఏ పాల్ తెలిపారు. తనతో ఢిల్లీ వచ్చే వాళ్ళు నేను చెప్పినట్టు నా నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఒక లెటర్ ఇవ్వాలని సూచించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై రమ్మంటే ఎక్కడికైనా వచ్చి కలుస్తానని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కాబట్టి కలిసి ఏపీని డెవలప్ చేద్దాం అని పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు ఎవరూ ఓట్లు వెయ్యరు..
మాజీ సీఎం చంద్రబాబు ఓ మూర్ఖుడు అని, మళ్లీ ఆయనకు ఎవరూ ఓటు వెయ్యరు అన్నారు కేఏ పాల్. ఏపీ, తెలంగాణ లకు పార్టీ తరపున ప్రతినిధులను నియమిస్తున్నానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిజమైన నాయకుణ్ణి నన్ను వదిలేసి వేరే పార్టీలను నమ్ముతున్నారు అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులాగ రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ సాధించలేమని అభిప్రాయపడ్డారు. మీరు రోడ్డుపై ధర్నాలు చెయ్యండి.. నేను అంతర్జాతీయ స్థాయిలో పోరాడతా అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుకు తన ఆలోచనల్ని షేర్ చేసుకున్నారు. తనపై కొన్ని మీడియాలలో దుష్ప్రచారం జరుగుతోందని, వారిని జాబ్ నుంచి తీసేయాలని మీడియా సంస్థల్ని కోరారు. లేనిపక్షంలో తాను కోర్టు నోటీసులు పంపిస్తా అని హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రూ.42 వేల కోట్లకు బిడ్ వేస్తానని కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ పై బిడ్ వేసేందుకు కొన్ని లేఖలు అవసరం. ఆ లెటర్స్ ఇవ్వాలని కోరారు. తనకు కావాల్సిన లేఖలు లభిస్తే కేవలం 2 వారాల్లోనే రూ.4వేల కోట్లు ఇస్తా అన్నారు. రూ.3.5 లక్షల కోట్ల విలువ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేవలం రూ.3,500 కోట్లకు అమ్మేద్దామని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ రద్దుపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.