విశాఖపట్నంలో ఏడాది ఒక్క రోజు జరిగే సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు చాలా దారుణంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఆరాధ్య దైవం అయిన సింహాద్రి అప్పన్నను సామాన్య భక్తులకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈరోజు తాను ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని చెప్పారు. కొండ కింది నుంచి పై వరకు వాహనాల రద్దీ ఏర్పడిపోయిందని, దానికి జవాబు చెప్పేవారే లేరని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఇంఛార్జి ఈవోతో ఎలా ఉత్సవాలు జరిపిస్తారని ప్రశ్నించారు.


తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, భక్తులు అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని చెప్పారు. ‘‘చందనోత్సవం సమయంలో ఏర్పాట్ల కోసం ఏటా మాతో చర్చించేవారు. ఈ ఏడాది అధికారులు సంప్రదించడానికి కూడా రాలేదు. ఆరు నెలలుగా ఈ ఆలయానికి ఈఓ లేకపోవడం వైఫల్యానికి పెద్ద కారణం’’ అని స్వరూపానందేంద్ర తెలిపారు.



మంత్రులకు చేదు అనుభవం
మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ అక్కడ కనిపించడంతో వారికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. సామాన్యులకు త్వరగా దర్శనాలు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో అన్నీ లోపాలే అని, రూ.1500 టికెట్లు కొనుగోలు చేసినా క్యూ లైన్లు కదలడమే లేదని నీలదీశారు. క్యూలైన్‌ వద్ద మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీశారు. కనీసం తాగునీటి లాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులపై దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి బొత్స మాట్లాడారు. 


కిక్కిరిసిన జనాల మధ్య వీఐపీలు
సింహాచలం చందనోత్సవానికి వస్తున్న ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్, జ్యుడీషియల్ అధికారులకు ప్రోటోకాల్ గౌరవం దక్కలేదు. వీవీఐపీలు కిక్కిరేసిన జనాల మధ్యే నలిగిపోయారు. నచ్చిన వారికి విచ్చలవిడిగా కారు పాస్ లు మంజూరు చేయడం వల్లే రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, రహదారిపై ట్రాఫిక్ ఏర్పడిందని తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహానికి గురైన భక్తులు అడుగడుగునా నేతలను ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు.


ఏటా వైభవంగా జరిగే సింహాచలం అప్పన్న చందనోత్సవం ఈ రోజు (ఏప్రిల్ 23) ఉదయం 4 గంటల నుండి మొదలైంది. స్వామి నిజరూపదర్శనం చేసుకునే అవకాశం కలగడం దానికి ఆదివారం సెలవు రోజు కలిసి కావడంతో భక్తులు భారీగా సింహాచలం కొండకు తరలివస్తున్నారు. రాత్రి 7 గంటల వరకూ లైన్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని విశాఖ  జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు.


ప్రసాదాలు కొండ కిందనే
ఈ ఏడాది సింహాచలం వరాహ లక్ష్మీ నారాయణ స్వామి ప్రసాదాలను కొండపైన కౌంటర్ల లో అమ్మడం లేదు. కొండ కింద గోశాల, పాత అడవివరం జంక్షన్ ల దగ్గర కౌంటర్లలో అమ్ముతున్నారు. అలాగే పిఠాపురానికి చెందిన శ్రీ పాద భావనాచార్యుల మహా అన్నదాన ట్రస్ట్ వారు 40 వేల మందికి చక్కర పొంగలి, కదంబం లాంటి ప్రసాదాలు పంచిపెడుతున్నారు. అలాగే ఎండను దృష్టి పెట్టుకుని 50కి పైగా స్వచ్చంద సంస్థలు కొండా క్రింద నీరు, ORS పేకెట్లను పంచిపెడుతున్నారు.