Simhachalam Chandanotsavam : సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. భక్తుల తాకిడి ఎప్పుడూ లేనంతగా పెరగడంతో అంతరాలయ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అప్పన్నస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో సింహాచల క్షేత్రానికి వస్తుండడంతో... కొండపై రద్దీ ఏర్పడింది. కొండపైకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో భక్తులు బస్సులు దిగి నడుచుకుంటూ కొండపైకి వెళ్తున్నారు. ఏడాదిలో ఒక్క రోజు లభించే నిజరూప దర్శనం చేసుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలతో భక్తుల్లో సింహాచలం చేరుకుంటున్నారు. వీవీఐపీల తాడికి ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ లో వేచిఉన్న సామాన్య భక్తుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ క్యూలైన్ లో నిరీక్షణతో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ భక్తులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. నిజరూప దర్శనం కల్పించడంతో ఆలస్యం అవుతోందని భక్తులకు వివరించారు మంత్రి.  క్యూ  లైన్ లో భక్తులకు మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేస్తు్న్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మహిళా భక్తురాలు సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెకు పోలీసులు ప్రథమ చికిత్స అందించారు.  


 చందనోత్సవం ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం- విష్ణువర్ధన్ రెడ్డి 


చిత్తశుద్ధి లేకుండా శివపూజ చేసినట్లే హిందూ వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వ తీరు ఉంటోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవాన్ని ఇంత ప్రణాళికా రహితంగా నిర్వహించడం ఎప్పుడైనా చూశామా? అని మండిపడ్డారు. సామాన్య భక్తుల్ని కుట్రపూరితంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. సామాన్య భక్తుడు వేల రూపాయలు ఖర్చులు పెట్టి దర్శనాలకు వస్తే ఏర్పాట్లు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మరో వైపు ఇతర ఆలయాల ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తున్నారన్నారు. ఇప్పుడు భక్తుల నమ్మకాలతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. హిందువుల మనోభావాలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారన్నారు. హిందువుల మనోభావాలకు తగ్గట్లుగా వ్యవహరించకపోతే ఏపీ బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రంజాన్ మాసంలో గుంటూరు కార్పొరేషన్ లో అన్ని మతాల ప్రజలు కట్టిన పన్నులతో 20 లక్షల వెచ్చించి, అంగరంగ వైభవంగా రంజాన్ ఏర్పాట్లతో పాటు విందు కూడా చేశారు మంచిదేనని కానీ హిందు భక్తులు పవిత్ర హుండీ సొమ్ముతో ఆలయాల వద్ద భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవాలయ శాఖకు వచ్చిన ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? సంఘటనలు యాదృచ్ఛికమా? ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? భక్తులకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సింహాద్రి అప్పన్నతో పాటు భక్తులు ఆగ్రహానికి గురి కాక తప్పదని గుర్తు చేస్తున్నామన్నారు.