Mediclaim Insurance: వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు రోగులను, వారి కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తాయి. అటువంటి అనూహ్య పరిస్థితుల్లో ఆర్థికంగా అండగా నిలిచే సరైన ఆరోగ్య బీమా పథకం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒక ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేసేటప్పుడే, అది అందించే ప్రయోజనాలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 


అందుబాటులో రెండు రకాల పద్ధతులు
రెండు రకాల ఆరోగ్య బీమా పాలసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 1. నగదు రహిత చికిత్సలు, 2. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు. నగదు రహిత చికిత్స పద్ధతిలో... మీ బీమా సంస్థే నేరుగా ఆసుపత్రితో మాట్లాడి బిల్లులను చెల్లిస్తుంది. బీమా కంపెనీ ఆమోదించిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే ఇటువంటి క్లెయిమ్‌లు జరుగుతాయి. రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో... చికిత్స పూర్తయిన తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం బీమా కంపెనీకి క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సదరు బీమా కంపెనీ, మీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రకారం చికిత్స ఖర్చును మీకు చెల్లిస్తుంది.


మీరు నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స పొందినా కూడా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయడానికి మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫారాన్ని పూరించాలి. అన్ని హాస్పిటల్ బిల్లులు, అవసరమైన పత్రాలను అందించాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఆదాయపు పన్ను నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం.


మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ గురించి మరింత తెలుసుకోండి
నగదు రహిత చికిత్సల్లో బీమా కంపెనీ, సదరు ఆసుపత్రి నేరుగా మాట్లాడుకుంటాయి కాబట్టి, పాలసీదారుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మెడికల్ రీయింబర్స్‌మెంట్ అంటే... ఆసుపత్రి ఖర్చులను ముందుగా మీరే భరించాలి, ఆ తర్వాత బీమా సంస్థ నుంచి వసూలు చేసుకోవాలి. కాబట్టి సంబంధిత బిల్లులు, పత్రాలను తప్పనిసరిగా సేకరించాలి, జాగ్రత్త చేయాలి. మీ చెల్లింపునకు సంబంధించిన అతి చిన్న రుజువును కూడా బీమా సంస్థకు సమర్పించాలి. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి, చికిత్స సమయంలోనే మీరు ఒక క్రమపద్ధతిలో వ్యవహరిస్తే, సులభంగా & అవాంతరాలు లేని రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ వీలవుతుంది.


పత్రాల పరిశీలన
థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (TPA) లేదా బీమా సంస్థ మీ హాస్పిటల్ బిల్లులు సహా అన్ని డాక్యుమెంట్‌లను నిశితంగా విశ్లేషిస్తాయి. కాబట్టి ఫైల్‌ చేసే ముందుగా మీరు వాటిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. 


మెడికల్ రీయింబర్స్‌మెంట్ డబ్బు పొందడానికి అవసరమైన పత్రాలు: 


మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫారాన్ని సక్రమంగా నింపి సంతకం చేయాలి
మీ బీమా పాలసీ లేదా పాలసీ కార్డ్ నకలు
వైద్యుడు సంతకం చేసిన వైద్య ధృవీకరణ పత్రం
ఎక్స్‌-రే సహా అన్ని పాథాలజీ రిపోర్ట్‌లు
హాస్పిటల్ బిల్లులు, అసలు రశీదులు
ఆసుపత్రి డిశ్చార్జ్ కార్డ్
ఫార్మసీ బిల్లు
ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులు (ఏవైనా ఉంటే)
యాక్సిడెంట్ క్లెయిమ్ అయితే FIR లేదా MLC కాపీ
NEFT వివరాలతో క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్
క్లెయిమ్ రూ.1 లక్ష కంటే ఎక్కువ అయితే KYC ఫారాన్ని సరిగ్గా పూరించాలి
ఈ డాక్యుమెంట్లన్నింటి ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి.


మీరు సమర్పించిన పత్రాల ధృవీకరణ ప్రక్రియ కారణంగా.. నగదు రహిత ప్రక్రియ కంటే రీయింబర్స్‌మెంట్ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. దీనికి మీకు కాస్త ఓపిక ఉండాలి, బీమా కంపెనీతో సహకరించడం అవసరం. వారు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సకాలంలో సమాధానం ఇవ్వాలి. మీ TPA లేదా బీమా సంస్థతో సత్సంబంధాలను కలిగి ఉండటం ముఖ్యం. అదే సమయంలో, మెడికల్ రీయింబర్స్‌మెంట్ & నగదు రహిత చికిత్సల నియమాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే.