Visakhapatnam to see major Traffic restrictions on 12 November: ఏయూ సభా వేదికకు ప్రధాని మోదీ, సీఎం జగన్
ఏయూ సభా వేదికకు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రధాని మోదీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. నేడు రెండు ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ, రోడ్ షో కారణంగా నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ నుంచి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి గానీ, త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వైపు భద్రత కారణాలతో ఎటువంటి సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నేడు జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్‌తో కలిసి పరిశీలించారు. బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రులు తెలిపారు. 30 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాల దారి మళ్లింపు
శనివారం నగరంలో ప్రముఖుల పర్యటనలు, వారి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు (నవంబర్ 12న) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖపట్నం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లే అన్నీ భారీ వాహనాలను ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపుగా మళ్లించనున్నారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్నీ రకాల భారీ వాహనాలను లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా మళ్లిస్తారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రధానంగా మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాలైన పెద్ద వాల్తేరు కురుపాం సర్కల్ నుండి త్రీ టౌన్ పోలీ స్టేషన్ వైపు, స్వర్ణ భారతి నుంచి మద్దిలపాలెం వైపు, మద్దిపాలెం నుండి పిఠాపురం, మంగాపురం కాలనీ వైపు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు.
ప్రయాణాలు వాయిదా వేసుకోండి
విశాఖలో పలు కార్యక్రమాలు ఉండడంతో సాధారణ ప్రయాణీకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. నేడు జరగనున్న ప్రధాన మంత్రి మోదీ బహిరంగ సభకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేకమైన రూట్ ను కేటాయించారు. నోవాటెల్, సర్క్యూట్ హౌస్ నుంచి సెవెన్ హీల్స్ హాస్పిటల్ కుడి వైపునకు తిరిగి గొల్లలపాలెం జంక్షన్ మీదుగా ఆశీలమెట్ట స్వర్ణ భారతి స్టేడియం వద్ద వారికి కేటాయించిన ప్రత్యేకమైన రహదారి (BRTS) నుంచి ప్రయాణించి మద్దిలపాలెం AU Arch వద్దకు చేరుకోవాలి.
మోదీ, జగన్ సభకు 3 లక్షల మంది..
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారని, 3 లక్షల మంది హాజరు కానున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి 2 లక్షల మంది, శ్రీకాకుళం, విజయనగరం, ఏఎస్ఆర్ జిల్లాల నుంచి మరో లక్షమంది సభకు హాజరవుతారన్నారు. 11వ తేదీ సాయంత్రం ప్రధాన మంత్రి విశాఖ చేరుకుంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని విశాఖ పర్యటన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే కార్యక్రమం కావడంతో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యతగా భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని పర్యటనకు రాష్ట్రప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. సమయం తక్కువగా ఉన్నందున, కోర్టులో అడ్డంకులన్నీ తొలగిపోయినప్పటికీ, భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన వీలుకావడం లేదని అన్నారు.