Pawan Kalyan : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీతో జనసేన అధ్యక్షుడు శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో పవన్ సమావేశం అయ్యారు. ఇవాళ సాయంత్రం విశాఖ చేరుకున్న పవన్ నోవోటెల్ హోటల్ బస చేశారు. ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోళ హోటల్ కు చేరుకోగానే ముందుగా పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ ఏకాంతంగానే పవన్ తో భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం పది నిమిషాల భేటీ అయినా అరగంటకు పైగా మోదీ-పవన్ సమావేశం కొనసాగింది. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్తులో మంచి రోజులు
"దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశాను. ఈ మీటింగ్ ఏపీ బాగుండాలనే ఉద్దేశంతో జరిగింది. ప్రధాని మోదీ ఏపీలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏపీకి మంచిరోజులు వస్తాయి. ఏపీ బాగుండాలనేది ప్రధాని ఆకాంక్ష. నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్రధానికి అన్ని వివరాలు తెలియజేశాను. త్వరలో అన్ని విషయాలు చెబుతాను. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని మోదీని కలిశాను. పీఎంవో నుంచి రెండ్రోజుల క్రితం సమాచారం వచ్చింది. 2014 తర్వాత సుమారు 8 ఏళ్ల తర్వాత ప్రధానిని కలిసే అవకాశం వచ్చింది. దిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేకపోయాను. ఇది ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన మీటింగ్. తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ మీటింగ్ భవిష్యత్ లో మంచి రోజులు తీసుకోస్తుందన్నారు. " - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రెక్కీ జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ తరుణంలో పవన్‌కు సెక్యూరిటీ కల్పించాలని విశాఖలో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. విశాఖ యారాడ బీచ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పవన్ కల్యాణ్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఆయన అభిమానులు కోరారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా విశాఖకు వస్తున్న ప్రధాని మోదీకి జనసేన నేతలు, కార్యకర్తలు పవన్‌కు భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు.
రేపు ఉదయం ప్రధానితో సీఎం, గవర్నర్ భేటీ
ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న ప్రధాని ఐఎన్‌ఎస్ చోళలో బస చేయగా గవర్నర్ నోవాటెల్ హోటల్‌లో, సీఎం పోర్టు అతిథి గృహంలో ఉన్నారు. శనివారం ఉదయం గవర్నర్, సీఎం జగన్ రోడ్డు మార్గంలో ఐఎన్‌ఎస్ చోళకు వెళ్లి ప్రధానితో సమావేశమవుతారు. తరువాత అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఏయూ గ్రౌండ్స్ ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు వస్తారు.
Also Read : PM Modi : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతల కన్నా ముందే పీఎంతో పవన్ భేటీ