జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ విశాఖ రాక సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనలను సీరియస్‌గా తీసుకుంది ఏపీ పోలీస్ శాఖ. పవన్ విశాఖ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకోగా, ఎయిర్‌పోర్ట్‌ లో అప్పటి సీఐ ఉమాకాంత్‌, ఏసీపీ టేకు మోహన్‌రావుపై సస్పెన్షన్‌ వేటు వేసింది పోలీస్ శాఖ. అక్టోబరు 15న అధికార వైసీపీ పార్టీ విశాఖగర్జన సభ నిర్వహించింది. అదే సమయంలో జనవాణి పేరిట కార్యక్రమం నిర్వహించేందుకు పవన్‌ కళ్యాణ్ విశాఖకు వచ్చారు. అయితే రాష్ట్ర మంత్రులు, రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నుంచి తిరుగు ప్రయాణానికి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం, అదే సమయంలో విశాఖ వస్తున్న పవన్ కు స్వాగతం పలకడానికి భారీగా జనసేన పార్టీ. కార్యకర్తలు, అభిమానులు అభిమానులు ఎయిర్ పోర్టు కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 


మంత్రులపై దాడి చేశారని కేసులు నమోదు 
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై, ఇతర వైసీపీ నేతలపై ఉద్దేశ్య పూర్వకంగానే హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మంత్రి రోజా పీఏకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ ఘటన జరిగిన సమయంలో ఎయిర్‌పోర్ట్‌ సీఐ ఉమాకాంత్‌ (2004వ బ్యాచ్‌), ఇన్‌ఛార్జి ఏసీపీ టేకు మోహన్‌రావు (1989వ బ్యాచ్‌) నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇద్దర్నీ సస్పెండ్‌ చేశారు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన అధికారులు ఎయిర్‌పోర్ట్‌ లోపలే కూర్చున్నారని, మంత్రుల్ని లోపలికి పంపించడంలో అప్రమత్తంగా లేరని పోలీస్‌శాఖకు నివేదించినట్టు తెలిసింది. అదేరోజు పవన్ రోడ్ షో సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో విశాఖ పోలీసులు ఫెయిలయ్యారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఐ, ఏసీపీలపై సస్పెన్షన్‌ విధిస్తూ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


జనసేన నేతలకు ఊరట.. 
విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులు, వైసీపీ నేతలపై దాడి కేసులో జనసేన నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దాడి  ఘటనలో అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు 9 మంది జనసేన నేతలకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ విమానాశ్రయం ఘటనలో పోలీసులు మొత్తం 70 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 61 మందికి స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. మిగిలిన 9 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉండడంతో స్థానిక కోర్టు వారికి రిమాండ్ విధించింది.  


స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తాజాగా వారికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విశాఖ జైల్ లో ఉన్న జనసేన నేతలు కోర్టు ఆదేశాలు అందగానే విడుదల అవ్వనున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు కేసులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా. రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.  జనసేన నేతలకు బెయిల్ రావడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని పవన్ ఆరోపించారు. జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం అని పవన్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను ఎల్లప్పుడూ సంపూర్ణంగా విశ్వసిస్తానన్నారు. ఆ నమ్మకంతోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించామన్నారు. హైకోర్టుకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read: Janasena : మంత్రులపై దాడి కేసులో జనసేన నేతలకు బెయిల్, హైకోర్టు తీర్పుపై పవన్ కల్యాణ్ హర్షం