CPM Protest over Damaged Roads:  పార్వతీపురం మన్యం జిల్లా  నుంచి రాయగడ వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై పెద్ద గోతులు ఏర్పడి నీళ్లు నిలిచి అధ్వాన్నంగా తయారైంది. గోతులలో మోకాల్లోతు వర్షపు నీరు నిలిచింది. ఆ రోడ్డు పై ప్రయాణం చేయడం అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది. దీనిపై మంగళవారం కొమరాడ సమీపంలో ఉన్న రహదారి గోతులలో నిలిచిన నీటిలో సీపీఎం పార్వతీపురం మన్యం జిల్లా నేత సాంబమూర్తి ఈత కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా గత వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రోడ్డును జర పట్టించుకోండి 
తక్షణమే అధికారులు స్పందించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్పందించి నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని  సీపీఎం పార్టీ నేత సాంబమూర్తి ధ్వజమెత్తారు. రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధకారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని.. నిత్యం రవాణా వ్యవస్థకు, ప్రజా రవాణాకు ఉపయోగపడే ఈ జాతీయ రహదారిని సురక్షితంగా నిర్మించి జాతికి అంకితం చేయాలని ఈ సందర్భంగా  సాంబమూర్తి మీడియా కు తెలిపారు.


వంతెన పనులు పూర్తి చేయండి
పూర్ణపాడు – లాబేసు బ్రిడ్జి నిర్మాణం పెండింగ్ పనులు  పూర్తి చేయాలని సీపీఎం నేత కె.సాంబమూర్తి డిమాండ్ చేశారు.   కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ కొమరాడ మండలానికి సంబంధించి తొమ్మిది పంచాయతీలు, 45 గిరిజన గ్రామాలకు ఉపయోగపడే పూర్ణపాడు – లాబేసు వంతెన 18 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వంతెన నిర్మాణం 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 40 శాతం పనులు పూర్తిచేయాలన్నారు. ఈ మేరకు పనులు పూర్తి చేయాలని కోరుతూ జాయింట్‌ కలెక్టర్‌ శోభికకు వినతిపత్రాన్ని  అందించారు.