ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని ఉద్యమాలు చేసినా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. కచ్చితంగా అమ్మే తీరుతామని చెప్పేలా నిర్ణయాలు తీసుకుంటుంది. 


తగ్గేదేలే అంటున్న కేంద్రం


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై ముందుకే అంటోంది కేంద్రం. ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ కట్టడానికి ప్రతిపాదనలకు రెడీ అవుతోంది. ఈ మేరకు సంస్థలను ఆహ్వానిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.


ఆస్తుల లెక్కింపునకు నోటిఫికేషన్


రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలుచుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విలువ లెక్కించడానికి బిడ్స్‌ను ఆహ్వానించింది కేంద్రం. కేంద్ర ఆర్ధిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ ఇన్వెస్టిమెంట్ విభాగం ఆర్డర్స్ రిలీజ్ చేసింది . 


తాజాగా కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపు పట్ల ఆశక్తి కలిగిఉన్నారో వాళ్లు http ://eprocure. gov.in/eprocure/app పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఆసైట్‌ ద్వారా తమ బిడ్స్ దాఖలు చేయాలని కేంద్రం తెలిపింది. 


ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌


మదింపు కోసం వేసే బిడ్స్‌ కేవలం ఆన్లైన్ పద్దతిలోనే స్వీకరించనుంది. ఫిజికల్‌గా గానీ, మాన్యువల్‌గా గానీ బిడ్స్‌ని దాఖలు చేయడానికి వీలుపడదని స్పష్టం చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. ఒక కంపెనీ నుంచి ఒక బిడ్‌ను మాత్రమే అంగీకరిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఒకసారి బిడ్ వేసిన తర్వాత మార్పులు చేర్పులకు, దిద్దుబాటుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది డిజిన్వెస్ట్‌మెంట్‌ శాఖ.


ఏపీ ప్రభుత్వం ఏమి చేయనుంది?


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఆస్తుల మదింపులనకు కేంద్రం బిడ్డలు ఆహ్వానించిన ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానియ్యమని అవసరమైతే తామే బిడ్డింగ్‌లో పాల్గొంటామని గతంలోనే ఏపీ ప్రభుత్వం చెప్పింది. స్టీల్ ప్లాంట్ ని సొంతం చేసుకుంటామని హామీ ఇచ్చింది. మరి ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అంతా ఎదురు చూస్తున్నారు. 


వెనక్కి తగ్గని కార్మిక సంఘాలు 


మొన్నే ఏడాది పూర్తి చేసుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం మరో బాంబు వేసింది. అందుకే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. కేంద్రం వెనక్కి తగ్గే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని... ఈసారి ప్రజలను భాగస్వాములను చేస్తామని చెబుతున్నారు ఉద్యమకారులు.