Vizag Navy Marathon: వైజాగ్‌‌లో ఆదివారం 8వ ఎడిషన్ నేవి మారథాన్ ఘనంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్‌లో ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీలలో మారథాన్‌ను నిర్వహించారు. ఫుల్ మారథాన్‌ను చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కార్ జెండా ఊపి ప్రారంభించగా, హాఫ్ మారథాన్‌ను వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్ జెండా ఊపి ప్రారంభించారు. 10కే రన్‌ను విశాఖపట్నం సీపీ రవిశంకర్ ప్రారంభించారు. మారథాన్‌ పోటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వైజాగ్​ మారథాన్​ 2023 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది. విశాఖ నగర ప్రాముఖ్యతను తెలపడానికి ఈ మారథాన్ ఎంతగానో ఉపయోగపడతుందని నేవీ అధికారులు తెలిపారు.


గత ఏడాది మారథాన్‌లో పాల్గొన్న అడవి శేష్
ఇప్పటి వరకు విశాఖపట్నంలో 7 ఎడిషన్లు మారథాన్ నిర్వహించారు. 2014లో ప్రారంభమైన మారథాన్ 2019 వరకు ప్రతి ఏటా జరిగింది. అయితే కరోనా విజృంభించడంతో 2020, 2021లో మారథాన్ నిర్వహించలేదు. 2022లో 7 ఎడిషన్ పోటీలు నర్వహించారు. ఆదివారం నిర్వహించిన మారథాన్ 8 ఎడిషన్. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. సినీ నటులు అడివి శేష్, మిళింద్ సోమన్  ఆర్కే బీచ్‌లో మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటుడు అడివి శేష్ మాట్లాడుతూ.. తాను హీరో కాక ముందు ఎక్కువగా  గడిపింది విశాఖలోనే అని తెలిపారు. ఆనాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తువచ్చాయన్న ఆయన మారథాన్ లో పాల్గొన్న వారే నిజమైన హీరోలు ఆన్నారు.