YSRCP activist dies in Tekkali:


టెక్కలి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి కేంద్రంలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. జాతీయ రహదారిపై ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. కానీ ఈ వేడకల్లో పాల్గొన్నఒక దళిత కార్యకర్త బలయ్యారంటూ స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.


జాతీయ రహదారి వెంట ఎమ్మెల్సీ దువ్వాడ జన్మదిన వేడుకలు అంటూ విస్తృత ప్రచారం చేశారు. కానీ పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో స్టేజ్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని పార్టీ కార్యకర్త కళింగపట్నం కృష్ణారావు(40)  మృతిచెందాడు. అతడు కోటబొమ్మాలి మండలానికి చెందిన దళితుడు అని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ బర్త్ డే వేడుకలకు వెళ్లి కృష్ణారావు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు రోధిస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ అత్యుత్సాహంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపైనే వేడుకలు నిర్వహించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించడం వివాదాస్పదం కావడం తెలిసిందే.