కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండపై నిర్మాణాలు చేపట్టామన్నారు మంత్రి బొత్స. విశాఖ రుషికొండపై కట్టడాలు కుదరదని కోర్టులు చెబితే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులు వ్యతిరేకంగా వెళ్లబోరని స్పష్టం చేశారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సామాజిక సమతుల్యం పాటిస్తున్నారని గుర్తు చేశారు. ఆర్ధికంగా వెనుకబడిన సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలని పని చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన, ఇప్పటికే మెడికల్ కాలేజ్ తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 13 మంది చనిపోయినపుడు, ముఖ్యమంత్రి జగన్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారని, గాయపడ్డ ప్రయాణికుల పట్ల మానవత్వం చాటుకున్నారని, బాధితులను ఆదుకునేందుకు నష్టపరిహారం కూడా వెంటనే అందజేశారని తెలిపారు. 


ఉచితం పేరుతో దోపిడీ


టీడీపీ హయాంలో ఉచితం పేరుతో ఇసుక దోపిడీ జరిగిందని మంత్రి బొత్స ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ఇసుక పాలసీని తెచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. అవినీతి జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు.