రాష్ట్రంలో తీవ్ర కరవు, దుర్భిక్షం తాండవిస్తున్నా, కేబినెట్ భేటీలో కనీసం చర్చ జరగలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టేందుకే సమయాన్నంతా వెచ్చిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు మండలాల ప్రకటనలోనూ రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. లక్షలాది ఎకరాల్లో కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని, రాష్ట్రంలో 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయం రంగంపై సీఎం, మంత్రుల ఉదాసీన వైఖరిని ఖండించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రజలు వలస బాట పడుతున్నది సీఎం జగన్ కు కనిపించడం లేదా.? అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ప్రజల దౌర్భాగ్యమని, రైతులు, రైతు కూలీల వలసలకు జగన్ రెడ్డి దోపిడీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రైతుల బాధ కనిపించలేదా.?


సీఎం జగన్ కు రాష్ట్రంలో అన్నదాతల బాధ కనిపించడం లేదా.? రైతుల సమస్యలు, సాగునీరు అందక కర్షకులు పడుతున్న అవస్థలపై కేబినెట్ లో చర్చించే తీరిక కూడా లేదా? అంటూ అచ్చెన్నాయుడు నిలదీశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కరువు వల్ల రూ.30 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించగా, ఇక్కడ వ్యవసాయం రంగంపై కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ, పంటలు కాపాడడంలోనూ, రైతులను ఆదుకోవడంలో లేదని ఎద్దేవా చేశారు. 


'మొక్కుబడిగా ప్రకటించారు'


రాష్ట్రంలో 400 మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా, సీఎం జగన్ మొక్కుబడిగా కేవలం 103 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రకటించారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి జులైలో రూ.500 కోట్లు విడుదల చేస్తే, జగన్ రెడ్డి కనీసం పంటలు కాపాడటానికి, తాగునీటి వసతి కల్పనకు కూడా రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కరువుకు ప్రజలకు బలవ్వడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు సీఎం దోపిడీ పాలనే కారణమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ హయాంలో రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే పేదల వలసలు ఉండేవి కావని చెప్పారు.


'సీఎం క్షమాపణ చెప్పాలి'


టీడీపీ హయాంలో నదుల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తే, అప్పట్లో వైసీపీ నేతలు వట్టిసీమ అన్నారని, ఇప్పుడు ఆ నీరే ఆధారమైందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పట్టిసీమపై నిందలు వేసిన సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతటి కరువు తాండవిస్తున్నా, ప్రజలు అల్లాడుతున్నా కరువు సాయం ప్రకటించలేదని, కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రజలు, రైతులను మోసం చేశారని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షంపై చర్చించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: ఎంపీ విజయసాయి రెడ్డిపై సీజేఐకు పురంధేశ్వరి ఫిర్యాదు - బెయిల్ షరతులు ఉల్లంఘించారని లేఖ