ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పదేళ్లుగా బెయిల్ పై ఉంటూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని, బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు లేఖతో పాటు 5 దస్త్రాలు, విజయసాయి కేసు వివరాలు, భూ కుంభకోణాలపై ప్రత్యేక కథనాలను జత చేశారు. 






'వాయిదాలతో విచారణకు డుమ్మా'


సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి అధికార అండతో పదేళ్లుగా బెయిల్ పై కొనసాగుతున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, పదే పదే వాయిదాలతో విచారణకు రాకుండా ఉంటున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు. దీని వల్ల సుదీర్ఘ కాలంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని లేఖలో వివరించారు. విజయసాయి తన బినామీలతో రాష్ట్రంలో కొన్ని డిస్టలరీలను నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని, ఈ అంశం వెలుగులోకి రాగానే, మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖలు రాసినట్లు తెలిపారు. విజయసాయి ఆధారాలు తారుమారు చేసే నేర్పరి కలవారని ఇది వరకు సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు పలు సందర్భాల్లో వెల్లడించిన వివరాల ద్వారా ఈ విషయం తెలుస్తోందని తన లేఖలో ప్రస్తావించారు. కేసుల్లో విజయసాయిని కింగ్ పిన్ గా దర్యాప్తు సంస్థ పేర్కొందని గుర్తు చేశారు.


'నన్ను బెదిరించారు'


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 2 ఏళ్లలో విజయసాయి అధికంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పురంధేశ్వరి ఆరోపించారు. కొందరిని బెదిరించి వారి ఆస్తులను కబ్జా చేయించారన్నారు. విశాఖ దసపల్లా భూముల విషయంలో అభివృద్ధి ప్రాతిపదికన భూ యజమానులకు నామమాత్రపు వాటాతో స్వాధీనం చేసుకోవడంలో సూత్రధారిగా వ్యవహరించారని తెలిపారు. వీటిలో కొన్నింటిని తాను ప్రస్తావిస్తే విజయసాయి తనను బహిరంగంగానే మీడియా సమావేశాల్లో తనపై బెదిరింపులకు పాల్పడ్డారని లేఖలో ఫిర్యాదు చేశారు. విశాఖకు రాజధాని మార్పిడి గురించి సైతం ముందస్తు సమాచారంతో అక్కడ అధికంగా ఆస్తులు సంపాదించేందుకు ఎంపీ తన బెయిల్ ను ఉపయోగించుకున్నారని అన్నారు. కేసుల నమోదు సమయంలో జగన్, విజయసాయి సాధారణ పదవుల్లో ఉన్నారని, ఇప్పుడు వారు అత్యున్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. 


'బెయిల్ రద్దు చేయండి'


పదేళ్లుగా వ్యవస్థలోని అన్ని అవకాశాలను ఉపయోగించుకుని విజయసాయిరెడ్డి వంటి వారు నేరాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నందున ప్రజలు వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేకా హత్య జరిగితే, అది గుండెపోటని ప్రెస్ మీట్ లో చెప్పిన తొలి వ్యక్తి విజయసాయి అని, ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సీజేఐను కోరారు. విజయసాయి రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల వివరాలను పరిశీలించి, లేఖలో తాను ప్రస్తావించిన అంశాల్లో జోక్యం చేసుకుని ఎంపీ బెయిల్ తక్షణమే రద్దు చేయాలని లేఖలో కోరారు. వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఓ కొలిక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: ఏపీ ఎన్నికలపై ఈసీ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ