Andhra Pradesh Elections: ప్రస్తుతం తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.  తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. తెలంగాణ తర్వాత అందరి దృష్టి ఇక ఏపీ ఎన్నికలపైనే ఉంటుంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలవ్వగా.. ఈసీ కూడా ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయగా.. జనవరి 2న తుది జాబితాను రిలీజ్ చేయనుంది. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎన్నికలను నిర్వహించడంపై ఈసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తరచూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా ఓటర్ల జాబితాను తయారు చేయాలని, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్‌లను సిద్దం చేయాలని తెలిపారు. అలాగే సరిహద్దుల వద్ద చెక్‌పోస్ట్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని, పోలింగ్ సిబ్బంది, లాండ్ అండ్ ఆర్డర్‌పై ఇప్పటినుంచే పకద్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖేష్ కుమార్ మీనా సూచనలు చేశారు.


అయితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా కొంతమేరకు ఉంటుంది. ఎందుకంటే ఏపీకి చెందిన చాలామంది సెటిలర్లు ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో లక్షల మంది సెటిలర్లు ఓటు వేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా నియోజకవర్గాల్లో సీమాంధ్ర గెలుపోటములు నిర్ణయిస్తారు. దీంతో సెటిలర్ ఓట్లను తమవైపుకు తిప్పుకునేందుకు పార్టీలన్నీ వ్యూహలు పన్నుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తోన్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలపై ఏపీ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
 
తెలంగాణలోని సెటిలర్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది తెలిస్తే ఏపీలో ప్రజల మూడ్ ఎలా ఉందనేది అంచనా వేయవచ్చు. అందుకే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తెలంగాణలో బలం లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ తెలంగాణలో పోటీ చేసి సీట్లు దక్కించుకోకపోతే ఏపీలో టీడీపీపై దాని ప్రభావం ఉంటుంది. దీంతో ఏపీలో గెలుపొందటంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్దమైంది. ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కనుక ప్రభావం ఉండదని ఆలోచిస్తోంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే అవకాశముంది. దీంతో పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌కు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.