Israel Hamas Attack:


అమెరికాకి హమాస్ హెచ్చరిక..


అగ్రరాజ్యం అమెరికాకి హమాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయేల్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా (Hamas Leader Ali Baraka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో అప్పుడు అమెరికా పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని, ఆ దేశ చరిత్ర గతంలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. సోవియట్ యూనియన్ ఎలా అయితే కుప్ప కూలిందో అలాగే అమెరికా కూడా నామ రూపాల్లేకుండా పోతుందని తేల్చి చెప్పారు. లెనబాన్‌కి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. అమెరికా శత్రువులంతా తమతో చేతులు కలుపుతున్నారని, యుద్ధానికీ వాళ్లు సిద్ధంగానే ఉన్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. 


"అమెరికా దేశాన్ని బ్రిటన్ స్థాపించింది. బహుశా త్వరలోనే ఈ దేశం నామరూపాల్లేకుండా పోతుండొచ్చు. అప్పట్లో సోవియట్ యూనియన్ ఎలా కుప్ప కూలిందో అమెరికా కూడా అలాగే కుప్ప కూలుతుంది. అమెరికా శత్రువులంతా మాతో చేతులు కలుపుతున్నారు. అగ్రరాజ్యంపై యుద్ధానికి వాళ్లంతా మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతా కలిసి అమెరికా చరిత్రను తుడిచి పెట్టేస్తాం. ఇకపై అమెరికా శక్తిమంతమైన దేశంగా ఉండలేదు"


- అలీ బరాకా, హమాస్ లీడర్ 


అమెరికాని కొట్టగలిగేది నార్త్ కొరియానే..


ఈ సమయంలోనే నార్త్ కొరియాపై ప్రశంసలు కురిపించారు అలీ బరాకా. అమెరికాని తలదన్నే సామర్థ్యం ఆ దేశానికి ఉందని కితాబునిచ్చారు. ఈ ప్రపంచంలోనే అమెరికాని కొట్టగల ఒకే ఒక దేశం ఉత్తర కొరియానే అని స్పష్టం చేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఉత్తర కొరియా అమెరికాపై దాడులు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. రష్యా, బీజింగ్‌తో ఎప్పటికప్పుడు తాము సంప్రదింపులు జరుపుతున్నట్టు హమాస్ లీడర్ అలీ వెల్లడించారు. 


"రష్యా మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది. దోహాకి చైనా ప్రతినిధులు వెళ్లారు. చైనా, రష్యా నేతలు హమాస్ లీడర్స్‌తో భేటీ అయ్యారు. అమెరికాని ఢీకొట్టగలిగేది నార్త్ కొరియా మాత్రమే. ఇరాన్‌కి అంత సామర్థ్యం లేదు. కేవలం కొన్ని ప్రాంతాలపైన మాత్రమే ఇరాన్ దాడి చేయగలదు. అమెరికాపై యుద్ధం చేసేంత ఆయుధాలు ఇరాన్ వద్ద లేవు. అయినా అమెరికా బేస్‌లపై దాడి చేసే కెపాసిటీ మాత్రం ఉంది"


- అలీ బరాకా, హమాస్ లీడర్