MP Soyam Bapurao: ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తెలంగాణ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కామెంట్లు చేశారు. ఆదివారం రోజు పాడేరులో జరిగిన జన జాతి సురక్ష మంచ్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ... పాడేరు రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. 80 కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికే దాదాపు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు. ఇలాంటి పాడైన రోడ్లపై ప్రజలు రోజూ ఎలా తిరుగుతున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణం అన్నారు. ఒక్క తెలంగాణ మాత్రమే వెనుక బడిందని అనుకున్నానని వివరించారు. కానీ ఏపీ పరిస్థితి కూడా అలాగే ఉందని విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాడేరు జిల్లాలో ఇప్పటికీ చదువుకోని యువత ఉన్నారంటే నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాడేరు, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సోయం బాపూరావు చెప్పుకొచ్చారు. 


రెండు నెలల క్రితం రోడ్ల పరిస్థితిపై ఫైర్ అయిన నాగబాబు


అనంతపురం నగరంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, టాలీవుడ్ నటుడు నాగబాబు పర్యటించారు. నగరంలోని చెరువు కట్టపై ఉన్న రోడ్డును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉందని నాగబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహకారంతో తమను ఇబ్బంది పెట్టినంత మాత్రాన తమ కార్యక్రమాలను జనసేన ఆపదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎలాగూ రోడ్లు వేయరని, జనసేనికులు రోడ్లు వేయాలని భావించారు. అయితే జనసేన శ్రేణులు రోడ్లు వేయడం మొదలు పెట్టగానే వైసీపీ ప్రభుత్వం ఆ మంచి పనిని కూడా ఏదో ఓ కారణం చెప్పి అడ్డుకుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగ పడే పనులు ఎవరైనా, ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు. కానీ ప్రభుత్వం చేయడం లేదని తాము మంచి పనులు మొదలుపెట్టినా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం నిజం కాదా అని నాగబాబు ప్రశ్నించారు. 


అనంతపురంలో ఆ దారి మరీ అధ్వాన్నంగా ఉంది..


అనంతపురంలో కలెక్టరేట్ నుంచి చెరువు కట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్ళే దారి అధ్వాన్నంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షుడు టీ.సీ. వరుణ్ నేతృత్వంలో నాగబాబు స్వయంగా పాల్గొని గుంతలు పూడుస్తారని తెలిసి అప్పటికప్పుడు స్థానిక అధికారులు రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. అయితే రెండున్నరేళ్లగా గుంతలు కూడా పూడ్చని అధికార పార్టీ నాగబాబు వస్తారని తెలిసి అప్పటికప్పుడు రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఎట్టకేలకు ఆ ప్రాంతాన్ని సందర్శించి మరమ్మతు పనులను పర్యవేక్షించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రోడ్లు బాగు చేయాలని పవన్ కల్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు డిమాండ్ చేశారు.