విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)కు ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌ఎండిసికి చెందిన బచేలి, కిరండోల్ గనుల నుంచి ఇనుప ఖనిజం సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. ఆర్‌ఐఎన్‌ఎల్ (RINL) ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద పారిశ్రామిక సంస్థ అని, దాని పనితీరు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటూ, ఆర్‌ఐఎన్‌ఎల్ పని తీరు విశాఖపట్నం, చుట్టుపక్కల లక్షలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.


అంతకుముందు తన అభ్యర్థనలు, పార్లమెంటరీ ప్రస్తావనల ఆధారంగా బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు కొంత ఉపశమనం కలిగించినందుకు ఉక్కు మంత్రికి ఎంపి జివిఎల్ కృతజ్ఞతలు తెలిపారు. 


ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండిసి (NMDC) లిమిటెడ్ నుండి ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి ఆర్‌ఐఎన్‌ఎల్ ఎదుర్కొంటున్న సమస్యను ఎంపి జివిఎల్ హైలైట్ చేశారు. RINL ప్రారంభం నుండి, NMDC కొన్ని నెలల క్రితం వరకు ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా (బచేలి, కిరండోల్) గనుల నుండి ఇనుప ఖనిజాన్ని RINLకి సరఫరా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. బచేలి, కిరండోల్ గనులు విశాఖపట్నానికి 560 కిలోమీటర్ల సమేపంలో సమీపంలో ఉత్తమ నాణ్యతతో ఉన్నాయని జీవీఎల్ పేర్కొన్నారు.


బచేలి, కిరండోల్ గనుల నుండి చాలా ఇనుప ఖనిజం ప్రైవేట్ ఉక్కు ఉత్పత్తిదారులకు సరఫరా చేయబడుతోంది కాబట్టి, విశాఖపట్నం నుండి 900 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న కర్నాటకలోని గనుల నుండి ఎక్కువ ఇనుము ధాతువు అవసరాలను పొందాలని NMDC ఇప్పుడు RINLని కోరింది. దీని కారణంగా, రవాణా నిమిత్తం టన్నుకు దాదాపు రూ.800 ఖర్చవుతుందని జీవీఎల్ లేఖలో పేర్కొన్నారు.


ప్రస్తుతం ఆర్‌ఐఎన్‌ఎల్ కేవలం నాలుగు రోజుల ఇనుప ఖనిజంతో నడుస్తోందని, అయితే ప్లాంట్‌కు రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను ఆపరేట్ చేయడానికి కనీసం 10 రోజుల స్టాక్ అవసరమని, మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లను ఆపరేట్ చేయడానికి 15 రోజుల స్టాక్ అవసరమని ఎంపీ జీవీఎల్ తన ఆందోళనను తెలియచేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్, ఎన్‌ఎండిసి రెండూ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నందున, ఎంపి జివిఎల్ నరసింహారావు సింధియా జోక్యం చేసుకుని ఛత్తీస్‌గఢ్‌లోని బచేలి, కిరండోల్ గనుల నుండి ఇనుప ఖనిజం సరఫరాను తిరిగి ప్రారంభించాలని ఎన్‌ఎండిసికి సూచించాలని కోరారు.


సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (CPSE)గా, RINLకి NMDC, మరొక CPSE ద్వారా ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ ఉండాలి కానీ, ప్రైవేట్ స్టీల్ ఉత్పత్తిదారులతో పోల్చితే ప్రతికూల వివక్ష కాదని ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు.