అవినీతి అంతం మీ పంతమా..? అక్రమాలను ప్రశ్నించడం మీకు అలవాటా..? లంచగొండులు లేని మంచి సమాజం కోసం మీవంతు ప్రయత్నిస్తున్నారా..? అయితే ఏసీబీతో చేతులు కలపండి, పనిలో పనిగా నగదు బహుమతి కూడా స్వీకరించండి అంటున్నారు అధికారులు. ఏపీలో ఏసీబీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. 5 వేల రూపాయలనుంచి 10వేల రూపాయల వరకు ఈ బహుమతి ఉంటుందని తెలిపారు. 


ఏపీలో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 14400. ఈ నెంబర్ కి ఫిర్యాదు చేసినవారికి ఇకపై నగదు బహుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే కేవలం ఫిర్యాదుకోసమే ఫోన్ చేస్తే సరిపోదు. సరైన ఆధారాల గురించి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా పక్కా ఆధారాలతో లంచగొండులను పట్టించిన వారికి 10వేల వరకు నగదు బహుమతి ఇస్తారు అధికారులు. 




కలెక్టరేట్‌ కార్యాలయం, ఆర్డీఓ ఆఫీస్, విద్యుత్ శాఖ కార్యాలయం, సబ్ ‌రిజిస్ట్రార్‌ ఆఫీసు, ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్ అయినా, చివరకు పోలీసులు లంచం అడిగినా కూడా తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు ఏసీబీ అధికారులు. గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా లంచగొండులు కనపడుతున్నారు. అలాంటివారిపై కూడా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచిస్తోంది. 14400కి ఫోన్ చేసినా, లేక అర్జీ రూపంలో ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామని చెబుతున్నారు అధికారులు. 


మీ వివరాలు గోప్యం..
ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు అధికారులు. ఫిర్యాదుదారులు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదని, వారి పనులు కాకుండా పోతాయని ఆందోళన చెందొద్దని సలహా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసినవారి వివరాలను ఎక్కడా బయటపెట్టబోమంటున్నారు అధికారులు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతూనే, ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని కూడా భరోసా ఇస్తున్నారు. 


సహజంగా పట్టాదారు పాస్ బుక్ లు ఇప్పించే క్రమంలో రైతుల వద్ద రెవెన్యూ ఉద్యోగులు లంచం తీసుకుంటుంటారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, జనన - మరణ ధ్రువీకరణ పత్రాలకోసం కూడా లంచాలు తీసుకునేవారున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల విషయంలో కూడా కొంతమంది లంచం అడుగుతుంటారు. ఇలాంటి సర్టిఫికెట్లన్నీ సచివాలయంలో నామమాత్రపు రుసుముతో అందించాల్సి ఉంది. కానీ వాటికి కూడా లంచం తీసుకునేవారిపై ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అధికారులు. 


ఏసీబీ యాప్..
ఏపీ ఏసీబీ మొబైల్ యాప్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు అదికారులు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ 14400కి కాల్ చేయొచ్చని, లేదా వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. 8333995858 నెంబర్ కి వాట్సప్ చేసి కూడా ఫిర్యాదులను తెలపవచ్చని అన్నారు. లేదా dg_acb@ap.gov.in కి మెయిల్ కూడా చేయొచ్చు. ఫిర్యాదు ఏరూపంలో చేసినా వాటిని పరిష్కరిస్తామని, ఫిర్యాదు దారులకు నగదు బహుమతి ఇస్తామని అధికారులు తెలియజేశారు. అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహిస్తున్నా కూడా పలు చోట్ల లంచాల మేత మాత్రం ఆగలేదు. ఇకపై అసలు లంచాల ప్రస్తావనే లేకుండా చేసేందుకు దాడుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. అందుకే నగదు బహుమతులంటూ ప్రజలకు ఆఫర్ ఇస్తున్నారు అధికారులు.